2018 వరకు గుంట భూమి లేదు.. ఇప్పుడు హరీష్ రావు పేరుమీద 13.12 ఎకరాల భూమి!
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేరిట ఉన్న భూములపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
దిశ, తెలంగాణ బ్యూరో: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేరిట ఉన్న భూములపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఆ భూములపై ఎంక్వయిరీ చేయాలని డెసిషన్ తీసుకున్నట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో రంగనాయకసాగర్ ప్రాజెక్టులో భాగంగా రైతుల నుంచి భూములు సేకరించేందుకు నోటీసులు జారీ చేయగా.. ఆ భూములను అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేరు మీదికి మార్చుకున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై చాలాసార్లు రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో అక్కడ హరీశ్‌రావుకు ఎకరాల కొద్దీ భూములు ఎలా వచ్చాయని ప్రభుత్వం విచారణ చేయనున్నట్లు తెలిసింది. ఈ భూమికి సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు లభ్యమైనట్లుగా సమాచారం.
హరీశ్ పేరిట 13.12 ఎకరాలు
సిద్దిపేట జిల్లా రామంచ గ్రామంలో 2018 ఆగస్టు వరకు అక్కడ హరీశ్‌రావుకు గుంట భూమి కూడా లేదు. ఆ తర్వాత ఆయన పేరు మీద అక్కడ 13.12 ఎకరాల భూమి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం ఎంక్వయిరీ చేపట్టనుంది. రామంచ గ్రామంలో రైతులకు నోటీసులు ఇచ్చి వారిని భయభ్రాంతులకు గురిచేసి.. భూములు తక్కువ ధరకు అమ్ముకునేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి. భూ రికార్డుల బదలాయింపు మొత్తం పకడ్బందీగా సాగినట్లుగా సమాచారం. రైతుల భూమి హరీశ్‌రావు పేరు మీదికి కాకుండా రైతుల నుంచి మరొకరు కొనుగోలు చేసి.. వారి నుంచి మాజీ మంత్రి కొనుగోలు చేశారని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రామంచలో సర్వేనంబర్ 402, 405, 406, 464లో మొత్తం 13.12 ఎకరాల భూమి హరీశ్‌రావు పేరు మీద ఉందని ధరణి పాస్ బుక్కులు సైతం స్పష్టం చేస్తున్నాయని ప్రభుత్వం ప్రాథమికంగా వివరాలు సేకరించినట్లు సమాచారం. రామంచలో సుడా నర్సరీ, సుడా ట్రీ పేరుతో ఉద్యానవనాలు ఉండగా.. వాటి పక్కనే హరీశ్‌రావుకు సంబంధించిన భూమి ఉంది. ఈ తతంగం వెనుక అప్పుడు కీలకంగా ఉన్న ఓ అధికారి పూర్తి అండదండలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి.
ప్రాజెక్టు కోసం సేకరించి..
రామంచలోని 402 సర్వే నంబర్లో ధరణి రికార్డుల ప్రకారం 5.04 గుంటల భూమి ఉంది. 2.08 ఎకరాలు రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు కోసం సేకరించారు. మరో 3.05 ఎకరాలు హరీశ్‌రావు పేరు మీద మారింది. 402/ఏ/ఏ/2 సర్వే నంబర్లో 1.36 ఎకరాలు కొన్నట్లుగా ఉంది. ఈ భూమిని 2019 ఫిబ్రవరి 11న కొనుగోలు చేసినట్లు ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లేవని గుర్తించినట్లు సమాచారం. 406/ఏ1 సర్వే నంబర్లో మూడు గుంటలు, 406/ఇ1 లో 16 గుంటల భూమి మాజీ మంత్రి పేరు మీద ఉంది. ఈ సర్వే నంబరులో ఆరెకరాల సేకరణకు నోటీసు ఇచ్చి 19 గుంటలు మినహాయించారు. ఈ భూమిని 2021 సెప్టెంబర్ 17న మారి ఎల్లయ్య నుంచి ఎడ్ల యాదవరెడ్డి కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2022 మే 13న హరీశ్‌రావుకు విక్రయించాడు. 464 సర్వే నంబరులో ధరణి ప్రకారం 9.30 గుంటల భూమి ఉంది. ఇందులో 1.29 భూమి సేకరించగా.. 8.01 ఎకరాలు హరీశ్‌రావు పేరు మీద ఉంది.