ఇతర జీవులతో పోలిస్తే ఏనుగులకు క్యాన్సర్ ప్రమాదం తక్కువ..

దిశ, ఫీచర్స్ : మనుషులు, ఇతర జీవులతో పోలిస్తే ఏనుగులు తక్కువగా క్యాన్సర్‌ బారినపడతాయని గత అధ్యయనాలు వెల్లడించాయి..Latest Telugu News

Update: 2022-07-19 04:28 GMT

దిశ, ఫీచర్స్ : మనుషులు, ఇతర జీవులతో పోలిస్తే ఏనుగులు తక్కువగా క్యాన్సర్‌ బారినపడతాయని గత అధ్యయనాలు వెల్లడించాయి. దీనికి గల కారణాలు తెలుసుకునేందుకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఓ అధ్యయనం చేపట్టగా.. ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. ఏనుగుల్లో క్యాన్సర్ కణతులను అణిచివేసే ప్రత్యేకమైన జన్యు వైవిధ్యాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడి కాగా, మానవులకు కొత్త మార్గాల్లో క్యాన్సర్ చికిత్సలను అభివృద్ధి చేయడంలో ఈ పరిశోధనలు సాయపడతాయని శాస్త్రవేత్తల బృందం భావిస్తోంది. ఈ పరిశోధన మాలిక్యులర్ బయాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్‌లో తాజాగా ప్రచురితమైంది. మరి ఏనుగులు క్యాన్సర్‌ను ఎలా అడ్డుకుంటున్నాయో తెలుసుకుందాం.

ఒక జీవి వయసు పెరిగే కొద్దీ దాని కణాలు ప్రతిరూపం పొందుతూనే ఉండటం సహా క్యాన్సర్ ఉత్పరివర్తనలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాగా పెద్ద జీవులు మరింత ఎక్కువ కణాలు కలిగి ఉంటాయి కాబట్టి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు భావించారు. వ్యక్తిగత జాతుల్లో(మానవులు నుంచి కుక్కల వరకు) ఈ అంచనా సబబే అయినప్పటికీ క్యాన్సర్ ప్రమాదం శరీర పరిమాణంతో సానుకూలమైన సహసంబంధం కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. కాబట్టి సిద్ధాంతపరంగా చూసుకుంటే ఎక్కువ కాలం జీవించే పెద్ద జంతువులు చిన్న, స్వల్పకాలిక జీవుల కంటే క్యాన్సర్‌ వచ్చే అవకాశం అధికంగా ఉండాలి. కానీ భూమ్మీద ఎక్కువ కాలం జీవించే భారీ జీవులైన తిమింగలాలు, ఏనుగుల్లో అందుకు భిన్నమైన ఫలితాలు రావడం ఆశ్చర్యకరం.

ఐదు శాతం మాత్రమే!

ప్రతీ జీవి క్యాన్సర్‌ అణచివేత కోసం తమకే సొంతమైన ప్రత్యేక సామర్థ్యాలను అభివృద్ధి చేస్తుందని భావించినా.. ఏనుగులు మాత్రం పరిశోధకులకు ప్రత్యేక ఆసక్తి కలిగించాయి. ఈ జంతువులు ఇప్పటికీ మానవులకు సమానమైన జీవితకాలాన్ని కలిగి ఉండటం సహా భారీ పరిమాణం ఉన్నప్పటికీ, వృద్ధాప్యంలో కూడా క్యాన్సర్‌కు సంబంధించి తక్కువ సంకేతాలను చూపుతాయి. మానవులతో(25 శాతం) పోలిస్తే, ఏనుగులు ఐదు శాతం మాత్రమే క్యాన్సర్‌కు గురవుతాయని శాస్త్రవేత్తల బృందం అంచనా వేసింది.

రక్షిస్తున్న పీ53 జీన్ :

క్యాన్సర్ కణతిని అణచివేసేందుకు ఏనుగులు 'p53'గా పిలిచే 20 రకాల జన్యు కాపీలను కలిగి ఉంటాయని గత అధ్యయనాలు వెల్లడించాయి. ఈ జన్యువు ముందుగా ప్రోటీన్‌ను ఎన్‌కోడ్ చేస్తుంది. ఆ తర్వాత కీలకమైన సెల్ ప్రొటెక్టర్‌గా పనిచేస్తుంది. DNA నష్టం లేదా మ్యుటేషన్‌ను గుర్తించినప్పుడు సెల్ విభజనను ఆపడమే దీని పని కాగా ఇదో గార్డులాగా పనిచేస్తుంది. ఒకవేళ p53 జన్యువు సరిగ్గా పని చేయకపోతే, క్యాన్సర్ కణాలు మల్టిపుల్ అవుతాయి. అప్పుడు క్యాన్సర్ కణజాలం వృద్ధి చెందుతుంది. నిజానికి జన్యువు క్రమబద్ధీకరణ అనేది అన్ని మానవ క్యాన్సర్లలో సగానికి పైగా పాత్ర పోషిస్తుంది. అయితే ఏనుగుల మాదిరిగా కాకుండా, మనకు జన్యువు ఒక కాపీ మాత్రమే ఉంది. దీంతో ఏనుగుల్లోని వివిధ రకాల p53 జన్యువులు క్యాన్సర్‌ను ఎలా అణచివేస్తాయో తెలుసుకునేందుకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కొత్త అధ్యయనం నిర్వహించింది.

ఎలా ఎదుర్కొంటాయి?

ఏనుగుల కణాల్లోని 'p53' జన్యు కార్యాచరణ MDM2 అని పిలిచే మరొక జన్యువు ద్వారా నియంత్రించబడుతుంది. ఇది తప్పనిసరిగా p53 ప్రోటీన్‌ను ఇన్‌యాక్టివేట్ (నిష్క్రియం) చేసే ప్రోటీన్‌ను ఎన్‌కోడ్ చేస్తుంది. నిజానికి ఆరోగ్యకరమైన కణాల పనితీరుకు p53-MDM2 జన్యువుల పాత్‌వే ప్రధానం కాగా, p53 జన్యువు ప్రతీ కణ ఆరోగ్యాన్ని, పనితీరును చెక్ చేస్తుంది. ఈ క్రమంలో MDM2 ప్రతి సెల్ సరిగ్గా పని చేస్తుందని చెప్పేందుకు ఒక సిగ్నల్ పంపడం ద్వారా సెల్‌డెత్‌ను ప్రేరేపించకుండా p53ని ఆపుతుంది. కాగా ఏనుగుల్లోని అనేక p53 రకాల ఉనికి.. దాని ట్యూమర్ సప్రెసర్ యాక్టివిటీపై చర్యతీసుకునేందుకు కొత్త విధానాన్ని అందిస్తుంది. ఈ క్రమంలోనే అది MDM2 ద్వారా ఆయా కణాలను ఇన్‌యాక్టివ్ కాకుండా చేస్తుంది. దీంతో ఆయా కణాలు క్యాన్సర్ కణాల రెప్లికేషన్స్(ప్రతిరూపణ)ను ఆపుతాయి. అదే మానవుల్లో మాత్రం p53 జన్యువు ఒక కాపీ మాత్రమే ఉన్నందున క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకోలేం.

'కొత్త అధ్యయనం క్యాన్సర్‌ నివారణకు ఏనుగులు రూపొందించిన యంత్రాంగాలపై ఆకట్టుకునే కొత్త అంతర్దృష్టులను అందిస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను అణచివేసేందుకు ఈ భారీ క్షీరదాలు వేర్వేరు p53 అణువులను ఎలా అమలు చేస్తాయో ప్రదర్శించడంతో పాటు చిన్న జీవులతో పోలిస్తే ఏనుగులు క్యాన్సర్‌ను నివారించడానికి మరిన్ని మార్గాలను కలిగి ఉన్నాయని ధృవీకరించడం ద్వారా పెటోస్ పారడాక్స్‌ను కొంతవరకు పరిష్కరించడంలో ఈ అధ్యయనం సాయపడుతుంది. క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించడంలో p53 ఎలా దోహదపడుతుందనే దానిపై అవగాహన పెంచింది. ఈ అధ్యయనం మానవుల్లో టార్గెట్ క్యాన్సర్ చికిత్సల కోసం అనేక కొత్త మార్గాలను అందించింది. నిజానికి జంతువులను అధ్యయనం చేసే అవకాశాన్ని మనం కోల్పోతే.. భయంకరమైన ప్రకృతి విపత్తులు, మానవ నష్టాల నుంచి వాటిని రక్షించకపోతే.. మనం అనేక రకాల వ్యాధులకు నివారణ మార్గాలను కోల్పోతాం.

- ఫ్రిట్జ్ వోలార్త్, సైంటిస్ట్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ


Similar News