రాజుకుంటున్న ఎన్నికల వేడి.. చెన్నమనేని వారసుల మధ్య వార్.. ?

దిశ ప్రతినిధి, కరీంనగర్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఒకే కుటుంబం మధ్య వార్ జరగనుందా..?

Update: 2022-03-18 08:46 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఒకే కుటుంబం మధ్య వార్ జరగనుందా..? ఆ కుటుంబ సభ్యులు మరోసారి ప్రజాక్షేత్రంలో తమ బలాబలాలను నిరూపించుకోనే ప్రయత్నాల్లో మునిగిపోయారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల కాలంలో జరగుతున్న పరిణామాలు కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయని కూడా చెప్పక తప్పదు. తెలంగాణ రాజకీయాల్లో చెన్నమనేని కుటుంబం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. చెన్నమనేని రాజేశ్వర్ రావు సీపీఐ, టీడీపీ తరుపున ఆరు సార్లు సిరిసిల్ల నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించగా, ఆయన చిన్న సోదరుడు సిహెచ్ విద్యాసాగర్ రావు బీజేపీ నుండి మెట్ పల్లి ఎమ్మెల్యేగా మూడు సార్లు, కరీంనగర్ ఎంపీగా రెండు సార్లు గెలిచారు. రాజేశ్వర్ రావు కుమారుడు చెన్నమనేని రమేష్ బాబు 2009లో వేములవాడ నియోజకవర్గం నుండి టీడీపీ నుండి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2010 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి అప్పటి నుండి గెలుస్తూ వస్తున్నారు.


 



బాబాయ్.. అబ్బాయ్..

2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రమేష్ బాబుపై ఆయన బాబాయ్ సిహెచ్ విద్యాసాగర్ రావు బీజేపీ అభ్యర్థిగా ప్రత్యర్థి అయ్యారు. ఈ ఎన్నికల్లో 36,601 ఓట్లు రమేష్ బాబు సాధించగా, విద్యాసాగర్ రావు 23,948 ఓట్లు పొంది మూడో స్థానంలో నిలిచారు. సైద్దాంతిక వైరుధ్యం ఉన్న పార్టీల్లో కొనసాగిన చెన్నమనేని బ్రదర్స్ ఏనాడు కూడా ముఖాముఖిగా తలపడలేదు. 2009 ఎన్నికల్లో మాత్రం బాబాయ్ విద్యాసాగర్ రావు, ఆయన పెద్దన్న రాజేశ్వర్ రావు తనయుడు రమేష్ బాబుపై పోటీ చేశారు. తెలంగాణ వాదాన్ని బలంగా వీస్తున్నప్పటికీ రమేష్ బాబు సేవ్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా చేపట్టిన కార్యకలాపాల కారణంగా టీడీపీ నుండి బరిలో నిలిచినప్పటికీ గెలవగలిగారు.

ఇప్పుడు బ్రదర్స్..

రానున్న ఎన్నికల్లో వేములవాడ నుండి పోటీ చేసేందుకు చెన్నమనేని వారసులు పావులు కదుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రమేష్ బాబు మరోసారి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పౌరసత్వ వివాదం హొల్డ్‌లో ఉన్నట్టయితే ఆయనే మరోసారి అభ్యర్థిగా నిలివనున్నారని తెలుస్తోంది. ప్రత్యామ్నాయ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నప్పటికీ వేములవాడలో రమేష్ బాబుకు ఉన్న ఓటు బ్యాంకు టీఆర్ఎస్ పార్టీకి లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌరసత్వ వివాదంపై కోర్టు తుది తీర్పు వెలువరించనట్టయితే మరోసారి రమేష్ బాబే టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు సమాచారం. అయితే ఇదే సమయంలో ఆయనపై పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తూ ముందుకు సాగుతున్నారు మాజీ గవర్నర్, సీనియర్ బీజేపీ నాయకుడు సిహెచ్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటిస్తూ హెల్త్ క్యాంపులు నిర్వహించడంతో పాటు తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ఉచిత చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల్లోని కేడర్ తో టచ్ లో ఉంటున్న డాక్టర్ వికాస్ తరుచూ కరీంనగర్‌లో ప్రత్యేకంగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. చెన్నమనేని రమేష్ బాబుకు టీఆర్ఎస్, డాక్టర్ వికాస్‌కు బీజేపీ టికెట్ ఇచ్చినట్టయితే 2009 ఎన్నికలు రిపిట్ కానున్నాయి.

ఇద్దరికీ సవాల్..

అయితే వేములవాడ నుండి తమ సత్తా చాటాలనకుంటున్న చెన్నమనేని వారసులిద్దరికీ కూడా సవాల్ ఎదురుకానుందని చెప్పకతప్పదు. సిట్టింగ్‌గా ఉన్న రమేష్ బాబు పౌరసత్వ వివాదంపై ఇప్పటికే కేంద్రం స్పష్టత నిచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు జర్మని పౌరసత్వం ఉన్నదని, ఆయన ఎన్నికల చెల్లదని కోర్టు తీర్పు వెలువరించినట్టయితే ఆయన బరిలో నిలిచే అవకాశాలు తక్కువేనని చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా రమేష్ బాబుపై వ్యతిరేకత వ్యక్తం అయింది. ఆయన శిష్యులుగా ముద్రపడ్డ వారే రెబల్ అభ్యర్థులుగా ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయడంతో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆ సమయంలో రమేష్ బాబుపై నియోజవర్గంలో ఉన్న వ్యతిరేకతను కూడా రెబెల్స్ కులంకశంగా వివరించారు. ఈ రెండు సమస్యలు సిట్టింగ్ రమేష్ బాబుకు పెను సవాల్‌గా మారాయన్నది వాస్తవం. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన చల్మెడ లక్ష్మీ నరసింహరావును టీఆరెఎస్‌లో జాయిన్ చేసుకున్నారని, ఇక్కడి నుండి ఆయన్ని పోటీ చేయించేందుకు కూడా అధిష్టానం ఆలోచిస్తోందన్న ప్రచారం కూడా సాగుతోంది. వీటన్నింటిని అధిగమించితేనే రమేష్ బాబుకు మరోసారి అవకాశం దక్కుతుందని అంటున్నాయి పార్టీ వర్గాలు. మరోవైపున కొత్తగా రాజకీయాల్లోకి అరంగ్రేట్రం చేయాలనకుంటున్న బీజేపీ సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర వికాస్‌కు కూడా ఓ సవాల్ లేకపోలేదు. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించే బీజేపీ డాక్టర్ వికాస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుందా అన్న మీమాంస కూడా ఉంది. ఇటీవల ప్రధాని మోడీ కూడా వారసత్వ రాజకీయాలకు తావివ్వవద్దనే కొంతమందిని అభ్యర్థులుగా ప్రకటించేందుకు నిరాకరించానని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో విద్యాసాగర్ రావు వారసునిగా రంగంలోకి దిగిన డాక్టర్ వికాస్ పట్ల బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ కూడా సాగుతోంది.

Tags:    

Similar News