ఖరీదవుతున్న గుడ్లు, మాంసం ధరలు!
అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఇప్పటికే వంటగదిలో అన్ని రకాల పదార్థాలు ఖరీదైన సంగతి తెలిసిందే.
కోల్‌కతా: అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఇప్పటికే వంటగదిలో అన్ని రకాల పదార్థాలు ఖరీదైన సంగతి తెలిసిందే. తాజాగా పౌల్ట్రీ ఫారం ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో గుడ్లు, మాంసం ధరలు ప్రియంగా మారాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల గుడ్డు ధర దాదాపు రూ. 6కి తగ్గిన తర్వాత మళ్లీ రూ. 7కి పెరిగింది. అలాగే, బ్రాయిలర్ చికెన్ ధరలు కూడా గత వారం వ్యవధిలోనే కిలోకు రూ. 20-25 వరకు పెరిగాయని రిటైల్ వ్యాపారులు తెలిపారు.
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. కోళ్ల దాణా ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. వీటి ఖర్చు దాదాపు 90 శాతం పెరిగింది. మేత, ఔషధాల ధరలు ఇప్పటికె 80 శాతం పెరిగాయి. ఇంధన ధరలు అధికంగా ఉండటం వల్ల ఖర్చుల్లో 8.5 శాతం వరకు భారం పడుతోంది. ఈ క్రమంలో గుడ్డు ధర రూ. 7 కంటే తక్కువ ఉంటే రైతులకు లాభదాయం కాదని పౌల్ట్రీ ఫెడరేషన్ కార్యదర్శి స్పష్టం చేశారు. ఆయిల్ కేక్, ఇతర ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో దాణా ధరలు గణనీయంగా పెరిగాయని అన్‌మోల్ ఫీడ్స్ ఎండీ అమిత్ చెప్పారు. అయితే, ప్రస్తుతం ఉన్న ధరల కంటే ఎక్కువకు వెళ్లకుండా ఉండేందుకు అసోసియేషన్ ప్రయనిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.