విద్యతోనే మనిషి విలువ.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దిశ, నిర్మల్ కల్చరల్: విద్యతోనే సమాజంలో మనిషి విలువ లభిస్తుందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ latest telugu news..
దిశ, నిర్మల్ కల్చరల్: విద్యతోనే సమాజంలో మనిషి విలువ లభిస్తుందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ ముషారఫ్ అలీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, అందరూ మంచి చదువులు చదువుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. జిల్లాలోని 735 పాఠశాలలో 1,346 మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ప్రభుత్వం రూ.1000 నుంచి 3000 కు వేతనం పెంచిందని అన్నారు. జిల్లాలో 250 పోస్టులు పోలీస్ శాఖకు రానున్నందున అధికారులు యువతకు మంచి శిక్షణ ఇచ్చి పోలీసు ఉద్యోగాలు భర్తీ అయ్యేలా చూడాలన్నారు.
అంతేగాక ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఖాళీలు భర్తీ ప్రక్రియకు పూనుకున్నందున యువత ఉద్యోగాలు దక్కించుకోవాలన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం దళిత బంధు పథకం కింద అధికారులు, లబ్ధిదారులకు డిమాండ్ ను అనుసరించి మంచి యూనిట్లు ఎంపిక చేయాలన్నారు. జిల్లాలో అట్రాసిటీ కేసులు ఒక్కటి కూడా నమోదు కాకపోవడం శుభ పరిణామం అని అన్నారు. అంబేద్కర్ భవన నిర్మాణం ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే ఘాట్ రోడ్డు పై ప్రమాదాలు సంభవించకుండా క్రాష్ బ్యారికేడ్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ఈ ఈ, ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాలన్నారు. నిర్మల్ రూ. 1 కోటి 45 లక్షల తో సిటీ స్కాన్ మిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నార్మల్ డెలివరీ ల విషయంలో నిర్మల్ జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉందన్నారు. ప్రతి గ్రామంలో రోడ్డు భద్రతపై తరచూ అవగాహన సమావేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. అవసరమైన చోట వేగ నిరోధకాలను నిర్మించాలని, స్కూల్ జోన్ లో కూడా జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఏర్పాటు చేయాలని డీఈఓ రవీందర్ రెడ్డి కోరగా, ఎక్కడెక్కడ అవసరమో గుర్తించి జాబితా పంపించాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో గత సంవత్సరం ప్రమాదాల వల్ల 130 మంది మరణించారని, దీన్ని అరికట్టడానికి రోడ్డు భద్రతపై పలు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించినట్లయితే వారికే కాక వారి వల్ల ఇతరులకు కూడా ప్రమాదాలు జరగవని సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల చాలావరకు ప్రమాదాలు తగ్గాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్ఖడే, పి. రాంబాబు, భైంసా అడిషనల్ ఎస్పీ కిరణ్ కారే, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లాలోని ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.