నైరాశ్యంలో డీఎస్పీలు.. సీఐలుగా ఉన్నా బాగుండేదేమోనని ఆవేదన

దిశ ప్రతినిధి, కరీంనగర్: పదోన్నతుల కోసం ఎదురుచూసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు..DSPs in depression?

Update: 2022-03-11 10:03 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: పదోన్నతుల కోసం ఎదురుచూసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించినా ఆ ఆనందం మాత్రం వారిలో లేకుండా పోయింది. ఏడాదిగా వారు పోస్టింగులు లేక అటాచ్డ్ అధికారులు కాలం వెల్లదీస్తున్నారు. రాష్ట్రంలో గత సంవత్సరం మార్చి 27న సుమారు 120 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ జోన్ లోని 1995 బ్యాచ్, హైదరాబాద్ లోని 1996 బ్యాచ్ లకు చెందిన వీరికి ప్రమోషన్ ఇచ్చిన ప్రభుత్వం పోస్టింగ్ లు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో 105 మంది వరకు డీఎస్పీలు ఆయా కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాలకు అటాచ్డ్ డ్యూటీలు చేస్తూ సరిపెట్టుకుంటున్నారు.

బందోబస్తులకే పరిమితం...

పదోన్నతి ఇచ్చిన తర్వాత అప్పటివరకు వారు సీఐలుగా పనిచేసిన కమిషనరేట్, ఎస్సీ కార్యాలయాలకు అటాచ్డ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అప్పటినుండి వీరిని సంబంధిత అధికారులు బందోబస్తు డ్యూటీలకు వినియోగించుకుంటున్నారు. పోస్టింగ్ వస్తాయని ఆశిస్తూ వీరంతా ఎదురు చూస్తునే ఉన్నారు. ఏడాది కాలంగా వీరందరికీ పోస్టింగ్ ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ.. పోలీసు ఉన్నతాధికారులు కానీ దృష్టి సారించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ప్రమోషన్ ఇవ్వండి మహా ప్రభో అని ఏళ్లుగా ప్రభుత్వాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి సాధించుకున్నా ఇప్పుడు పోస్టింగ్ కోసం ఎవరి చుట్టూ ప్రదక్షిణలు చేయాలో అర్థం కాక మానసిక వేదనకు గురవుతున్నారు డీఎస్పీలు?

సీఐలుగా ఉన్నా సరిపోయేదేమో...

పదోన్నతి పొందకుండా సీఐలుగా ఉన్నా ఏదో ఒక పోస్టింగ్ చేసే అవకాశం ఉండేది కానీ.. ఇప్పుడా అవకాశం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్పీలుగా ప్రమోషన్ వచ్చినా లాభం లేకుండా పోయిందని, లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ కాకున్నా లూప్ లైన్ వింగ్స్ లో అయినా పోస్టింగ్ అయినా ఇవ్వడం లేదని మదనపడుతున్నారు.

క్రియేట్ చేస్తారా..?

రాష్ట్రంలో నూతన జిల్లాల ఆవిర్భావం తరువాత కొన్ని లూప్ లైన్ వింగ్స్ ను విస్తరించలేదు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, ఇంటలీ జెన్స్, ట్రాన్స్ కో-విజిలెన్స్, సీఐడీ తదితర విభాగాలు నేటికీ పాత జిల్లాల పరిధిల్లోనే కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల కొత్తగా డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షించేందుకు కూడా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. ఆయా విభాగాల్లో వీరికి పోస్టింగ్ ఇచ్చినా సరిపోయేదన్న వాదన వినిపిస్తోంది. ఏడాది కాలంగా నేడో రేపో పోస్టింగ్ లు వస్తాయంటూ ప్రచారం జరగడం.. ఆ తరువాత ఈ విషయం మరుగున పడిపోవడంతో కొత్తగా పదోన్నతి పొందిన 100 మందికి పైగా డీఎస్పీలు నైరాశ్యంతో కొట్టుమిట్టాడుతున్నారు.

Tags:    

Similar News