మార్కెట్లో కొత్త మినరల్ వాటర్.. మద్యం దుకాణాలు, బస్టాండ్లే టార్గెట్!
దిశ ప్రతినిధి, వరంగల్/వరంగల్ టౌన్: ఆకర్షణీయమైన బాటిల్.. దానికి అందమైన లేబుల్ సుందరీకరణ.
దిశ ప్రతినిధి, వరంగల్/వరంగల్ టౌన్: ఆకర్షణీయమైన బాటిల్.. దానికి అందమైన లేబుల్ సుందరీకరణ. రేటు కూడా తక్కువే.. వాటర్ బాటిల్ కొనేముందు చాలామంది ఈ మూడు అంశాలనే పరిశీలించి కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఏ సంస్థ తయారు చేసింది.. ఆ సంస్థకు ఐఎస్‌వో గుర్తింపు ఉందా? లేదా? అనే విషయం గమనించడం లేదు. ఇదే కొంతమంది అక్రమ వ్యాపారులకు నిత్యం లక్షలాది రూపాయాలను కురిపిస్తోంది. తాజాగా.. వరంగల్ ఏనుమాముల కేంద్రంలో 'ఫ్రెష్' అనే పేరుతో ఓ సంస్థ నాసిరకం వాటర్ బాటిళ్లను, వాటర్ ప్యాకెట్లను మార్కెట్లోకి వదులుతోంది. సాయి బాలాజీ మ్యానిఫాక్చర్స్ పేరుతో కూడిన సంస్థ అడ్రస్, ఇతర వివరాలను లేబుల్‌పై పేర్కొంది. అయితే, లేబుల్‌పై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ (బీఐఎస్) ఐఎస్‌వో గుర్తింపు వివరాలు, బ్యాచ్ నెంబర్ లేకపోవడంతో అనుమానం వచ్చిన 'దిశ ప్రతినిధి' వరంగల్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రోహిత్‌రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఈ సంస్థకు ఎలాంటి బీఐఎస్, ఐఎస్‌వో గుర్తింపు, అనుమతుల్లేవని తేల్చి చెప్పారు.
మద్యం కేంద్రాలు.. ప్రయాణ ప్రాంగణాలే టార్గెట్
ఫ్రెష్ బ్రాండ్ పేరుతో జరుగుతున్న వాటర్ బాటిళ్ల అమ్మకాల గురించి ఆరా తీసిన 'దిశ'కు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. వరంగల్‌లోని పలు ముఖ్యమైన కూడళ్లలోని కిరాణా దుకాణాలు, బస్‌స్టేషన్లు, మద్యం దుకాణాలు, బార్‌షాపులతో పాటు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ దర్శనమివ్వడం విశేషం. పెద్ద హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, ఇళ్లకు, దేవాలయాలకు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు ఇంకా ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు కూడా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి అనుమతుల్లేకుండానే ఇంత భారీ మొత్తంలో అమ్మకాలు సాగిస్తున్నా.. ఫుడ్ సెక్యూరిటీ మరియు ఆరోగ్య శాఖల అధికారులకు మాత్రం కనబడటం లేదా? అంటే అతిశేయోక్తే. ఏనుమాముల కేంద్రంగా సాగుతున్న ఈ వ్యాపారం మూడు బాటిళ్లు.. ఆరు వాటర్ ప్యాకెట్లుగా వర్ధిల్లుతున్నా.. అధికారులు ఇటువైపు ఇన్నాళ్లు చూడకపోవడం వెనుక మర్మం ఏంటీ అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
ఇన్ని అనుమతుల్లుండాలి.. కానీ ఫ్రెష్‌కు..
వాటర్ ప్లాంట్ నిర్వహణకు జీడబ్ల్యూఎంసీ అనుమతి పొందాల్సి ఉంటుంది. గ్రామాల్లో మున్సిపల్ లేదా పంచాయతీ అనుమతి తీసుకోవాలి. పరిశ్రమల శాఖ నుంచి అనుమతులు పొందాలి. ప్లాంట్ నిర్వహణకు బీఎస్‌ఐ అనుమతులు తీసుకోవాలి. ప్లాంట్లలో మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ నిపుణులు తప్పనిసరిగా ఉండాలి. నిత్యం పరీక్షలు చేసిన తర్వాతే ప్రజలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. పీహెచ్ స్థాయి 10 కంటే తగ్గకుండా చూసుకోవాలి. తగ్గితే ఆ నీరు వినియోగించిన ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధపడే ప్రమాదం ఉంది. నీటిని సరఫరా చేసే డబ్బాలను నిత్యం పొటా షియం పర్మాంగనేట్‌తో శుభ్రం చేయాలి. నీటిలో పూర్తిగా కరిగిపోయే లవణాలను కూడా పరీక్షించాలి. ఇలా అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి అనుమతుల్లేకుండానే ఎనుమాముల కేంద్రంగా జరుగుతున్న వాటర్ వ్యాపారంలో చాలా ఉల్లంఘనలే ఉన్నట్లు తెలుస్తోంది.
బీఐఎస్ అనుమతే తక్కువ..
వరంగల్‌లో నిత్యం లక్షలాది రూపాయల నీటి వ్యాపారం జరుగుతోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ (బీఐఎస్) అనుమతి ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్లు కేవలం 25కు మించవని తెలుస్తోంది. అయితే అనధికారికంగా నడిచేవి మాత్రం దాదాపు 100కు పైగా ప్యాకేజ్డ్ డ్రికింగ్ వాటర్‌ను తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని మినరల్ వాటర్ ప్లాంట్లు బీఐఎస్ అనుమతి లేకున్నా.. ఉన్నట్లుగా ముద్రించి అమ్మకాలు జరుపుతున్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. కొంతమంది వ్యాపారులు ఇళ్ల సముహంలోని ప్రాంతాల్లో ప్రైవేట్ స్థలాలను లీజుకు తీసుకుని తక్కువ పెట్టుబడితో అనుమతులు లేకుండా బోర్లను తవ్వి, వాటిని నాణ్యతలేని ఫిల్టర్లతో వడపోసి విక్రయిస్తున్నారు.