సీపీఐకి కీలక నేత రాజీనామా.. కేజ్రీవాల్ సమక్షంలో ఆప్‌లోకి!
దిశ, తెలంగాణ బ్యూరో: సీపీఐ తెలంగాణ కౌన్సిల్ కార్యవర్గ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి డాక్టర్ దిడ్డి సుధాకర్ రాజీనామా చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: సీపీఐ తెలంగాణ కౌన్సిల్ కార్యవర్గ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి డాక్టర్ దిడ్డి సుధాకర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డికి పంపారు. 1974లో మలక్ పేటపార్టీశాఖ సభ్యుడిగా పార్టీలో సుధాకర్ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు, కార్యవర్గ సమావేశాలు, మహాసభలు, కంట్రోల్ కమిషన్, పార్టీ నిర్మాణం, అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించారు. పార్టీ నాయకత్వానికి ఏజ్ లిమిట్ ఉండాలని, కేరళ సీపీఐ మాదిరిగా రాష్ట్రంలో రెండుసార్లు కంటే ఎక్కువ ఎవరు ఎన్నికల్లో పోటీ చేయకూడదని, నూతన కార్యకర్తల రిక్రూట్‌మెంట్‌కు నిర్మాణం పటిష్టం చేయాలని, ప్రజా సంఘాల పటిష్టం, అన్ని పదవులకు పార్టీ నిబంధనల ప్రకారం సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరుపాలని, పార్టీలో ఆర్థిక అరాచకాలను అరికట్టాలని, ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ప్రతిపాదించానని వాటిపై చర్చించి మార్పులు చేస్తారని భావించానని కానీ ఎలాంటి ప్రతిపాదన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్ష పదవి నుంచి కారణం లేకుండానే తొలగించడం బాధ కలిగించిందని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ఆప్‌లో చేరనున్న సుధాకర్
ఆమ్ ఆద్మీ పార్టీలో సుధాకర్ చేరికకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 14న ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా అనుచరులతో కలిసి సుధాకర్ చేరనున్నారు. యువతరం, ఆప్‌తోనే మార్పు సాధ్యమని భావించి ఆ పార్టీలో చేరుతున్నట్లు సుధాకర్ తెలిపారు.