చనిపోయిన మత్స్యకారుడు.. ప్రతిరోజు అక్కడ ఎదురుచూస్తున్న శునకం..!
దిశ, ఫీచర్స్: పెరూలోని పుంటా నెగ్రాకు చెందిన ఓ మత్స్యకారుడు ‘ఫిషింగ్’- latest Telugu news
దిశ, ఫీచర్స్: పెరూలోని పుంటా నెగ్రాకు చెందిన ఓ మత్స్యకారుడు 'ఫిషింగ్' కోసం సముద్రయానానికి వెళ్లి దురదృష్టవశాత్తూ మరణించాడు. అయితే అతడి పెంపుడు కుక్క 'వాగిటో' మాత్రం అతడి రాక కోసం ఇంకా సముద్రతీరంలోనే వెయిట్ చేస్తోంది. సముద్రంలోకి వెళ్లేముందు యజమానికి బై చెప్పిన శునకం.. అతను ఎప్పటికైనా వస్తాడనే ఆశతో ప్రతిరోజూ అక్కడికి చేరుకుంటోంది. ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ కథ.. నెటిజన్ల హృదయాలను ద్రవింపజేస్తోంది.
పుంటా నెగ్రా తీరంలో జోలీ మెజియా అనే పెరువియన్ మహిళ నడుచుకుంటూ వెళుతుండగా వాగిటోను చూసింది. ఆ శునకం బాధలో ఉన్నట్లు, చాలా రోజులుగా తిండి లేకుండా ఏడుస్తున్నట్లు గమనించింది. అది సముద్రం వైపు ఎందుకు చూస్తుంది? ఎవరి రాకకోసం ఎదురుచూస్తుంది? అని తెలుసుకునే ప్రయత్నం చేసింది. కొంతకాలం క్రితం మరణించిన ఒక మత్స్యకారుడితో కుక్క నివసించిందని, అయితే అతడు చనిపోవడంతో ఒంటరైపోయిందని తెలుసుకుంది. ప్రతిరోజూ వాగిటో ఇక్కడకు వచ్చి కొన్ని గంటలపాటు తన యజమాని తిరిగి వస్తాడని ఎదురు చూస్తుంటుందని ఓ వ్యక్తి జోలికి వివరించాడు. ఈ కథ విని చలించిపోయిన ఆమె.. వాగిటో గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ మేరకు కుక్క సముద్రంలోకి ఆత్రుతగా చూస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.