Telangana News: రైతులకు కరెంట్ షాక్.. రాత్రంతా సింగిల్ ఫేజ్ సరఫరా
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: రాష్ట్రంలో తాజాగా - Cuts in three-phase supply times due to insufficient power supply to meet demand
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: రాష్ట్రంలో తాజాగా విద్యుత్ కోతలు మొదలయ్యాయి. డిమాండుకు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో త్రీఫేజ్ సరఫరా వేళల్లో కోతలు విధిస్తున్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని పేర్కొనగా.. ఇటీవల కాలంలో సాయంత్రం 5.00 నుంచి రాత్రి 12 గంటల వరకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపి వేసేవారు. దీంతో రాత్రి 12 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెగ్యులర్ త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేసేవారు. తాజాగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరగడం, సరిపోయేంత కరెంటు నిల్వలు లేకపోవడం, కొనుగోలు సమస్య ఉండటంతో.. వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరాలో కోతలు విధిస్తున్నారు. గురువారం రోజున రాత్రంతా సింగిల్ ఫేజ్ మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలని టీఎస్ ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఆయా జిల్లాల ఎస్ ఈలు, డీఈలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇక జిల్లాల వారీగా త్రీఫేజ్ విద్యుత్తు సరఫరాకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించారు. ఖమ్మం జిల్లాకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 వరకు, మహబూబాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు 8.15గంటల నుంచి 3.15 గంటల వరకు, జగిత్యాలకు 8.30 నుంచి 3.30వరకు, కామారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలకు 8.45 నుంచి 3.45 వరకు, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు 9 నుంచి 4 వరకు, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు 9.15 నుంచి 4.15 వరకు, జనగాం, కొత్తగూడెం జిల్లాలకు 9.30 నుంచి 4.30 వరకు, హన్మకొండ వరంగల్ జిల్లాలకు 9.40నుంచి 4.40వరకు, నిజామాబాద్ జిల్లాకు 9.50 నుంచి 4.50 వరకు, కరీంనగర్ జిల్లాకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఏ రోజు కా రోజు విద్యుత్ వేళలు ప్రకటించనున్నారు.
మరో పది రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. యాసంగి పంటలు చివరి దశలో ఉండగా.. వీటికి పగటి పూట మాత్రమే త్రీఫేజ్ విద్యుత్తు అందనుంది. ఒకవైపు ఎండలు మండుతుండగా.. పగటి పూట కరెంట్ ఏడు గంటలు మాత్రమే త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పంటలు చేతికొచ్చే దశలో కోతలు పెట్టడం.. అదీ పగటి పూట మాత్రమే ఇస్తుండటంతో ఇబ్బందులు తప్పేలా లేవు. పంటలు చేతికి వస్తాయో.. లేదో.. అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.