సహకారంలో స్వాహా.. వెలుగులోకి ఆ లీలలు

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సహకార సంఘాలు, బ్యాంకుల్లో స్వాహాకార్యం సాగుతోంది- latest Telugu news

Update: 2022-03-12 14:15 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సహకార సంఘాలు, బ్యాంకుల్లో స్వాహాకార్యం సాగుతోంది.. బ్యాంకర్లు, అధికారులు, సిబ్బంది కుమ్మక్కై.. పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎరువులు, విత్తనాలను రైతులకు రాయితీపై ఇవ్వగా.. విక్రయించిన డబ్బులు తిరిగి సహకార సంఘం ఖాతాకు జమ చేయటం లేదు. రుణాలు ఇచ్చిన డబ్బులు రికవరీ అయ్యాక.. తిరిగి బ్యాంకులో జమ చేయకుండా పక్కదోవ పట్టిస్తున్నారు. పాలక వర్గ సమావేశాల్లో సభ్యులు ప్రశ్నిస్తేగానీ.. ఆడిట్ చేసినప్పుడు పట్టుకుంటేగానీ.. అవినీతి, అక్రమాలు వెలుగు చూడటం లేదు. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిధుల మళ్లింపు, దుర్వినియోగం, స్వాహా చేసిన ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి..!

సహకార సంఘాల్లో సీఈవోలు, కో ఆపరేటివ్ బ్యాంకుల్లో మేనేజర్లు, ఇతర సిబ్బంది పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. గతంలో సహకార సంఘాల ద్వార సోయ కొనుగోళ్లు చేయగా.. ఎరువులు, విత్తనాలు విక్రయించారు. ఇందులో కొందరు సీఈవోలు, సిబ్బంది నిధులు పక్కదోవ పట్టిస్తున్నారు. ఈ నిధులను సహకార సంఘం ఖాతాలో జమ చేయలేదని ఇప్పటికే పలు చోట్ల వెలుగు చూసింది. వీటిని తమ సొంత ఖాతాలు, బంధువులు, స్నేహితుల ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. రైతులకు రుణాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు చూపగా.. రుణాలు తీసుకున్న రైతులు తిరిగి చెల్లించిన డబ్బులను ఖాతాల్లో జమ చేయటం లేదు. ఈ డబ్బులతో ప్లాట్లు, భూములు కొనుగోలు చేస్తుండగా.. సొంతానికి వాడుతున్నారు. బేల ఘటనలో సహకార నిధులను ఐపీఎల్ బెట్టింగులో పెట్టడం గమనార్హం. ఇప్పటికే కుంటాల, బేల, ఇంద్రవెల్లి, బన్సపెల్లి సహకార సంఘాలు, బ్యాంకుల్లో అవినీతి వెలుగు చూడగా.. పలుచోట్ల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. సోమవారం రోజున డీసీసీబీ, డీసీఎంఎస్ పాలక వర్గాల సమావేశం ఉండగా.. అవినీతి, అక్రమాలే ఎజెండాగా మారనుంది.

అక్రమార్కుల గుట్టురట్టు..

ఆదిలాబాద్ జిల్లా బేల సహకార సంఘంలో రూ.2.86కోట్ల నిధులను అధికారులు బంధువుల ఖాతాల్లో బదిలీ చేసుకున్నారు. సుమారు 11మంది సిబ్బంది తమ ఖాతాలతో పాటు బంధువుల ఖాతాల్లోకి మళ్లించారు. ఆరు నెలలకోసారి జరిగే ఆడిట్ చేయగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు బ్యాంకు మేనేజర్లతో పాటు 7గురు బ్యాంకు సిబ్బంది ఉన్నారు. ఆదిలాబాద్-2, బేల-4, జన్నారం-4, భీంపూర్-1కు చెందిన బ్యాంకు సిబ్బంది, బంధువుల ఖాతాకు బదిలీ అయినట్లు గుర్తించారు. మొత్తం 11మందిని సస్పెండ్ చేయగా.. రికవరీకి ఆదేశించారు. వీరందరిపై కేసులు పెట్టేందుకు ఫిర్యాదు చేయగా.. హెడ్ ఆఫీసుకు తీసుకెళ్లారు. ఈ కేసును సీఐడీకి అప్పగించారు.

పైసలు పక్కదోవ.. ప్లాట్లకు పెట్టుబడి

బన్సపెల్లి సహకార సంఘంలో 2018-2019లో పాత పాలక వర్గం ఉన్నప్పుడు రూ.19లక్షలకుపైగా నిధులు దుర్వినియోగం చేశారు. సహకార సంఘం ద్వారా సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు విక్రయించగా.. రైతుల నుంచి వచ్చిన డబ్బులు తన సొంతానికి వాడుకున్నారు. ఈ నిధులతో సదరు అధికారి హైదరాబాదు, నిర్మల్ పట్టణాల్లో ప్లాట్లు కొనుగోలు చేశారు. మొత్తం రూ.30లక్షలు వాడుకోగా.. రూ.11లక్షలు తిరిగి కట్టారు. మరో రూ.19లక్షలు నిధులు రాబట్టాల్సి ఉంది. గ్రామంలో భూమి, నిర్మల్లో ప్లాటు అటాచ్ చేశారు. ప్లాటును అమ్మేందుకు పాలక వర్గం తీర్మానం చేసి పంపించారు.

అవినీతి జరిగిందనే ఆరోపణలు..

ఖానాపూర్ మండలం సత్తెనపల్లి సహకార సంఘంలో అవకతవకలు జరిగినట్లు పాలక వర్గం ఆరోపిస్తోంది. ఎన్నికల సమయంలో సుమారు రూ.8లక్షలకు పైగా నిధులు ఉండగా.. ప్రస్తుతం డబ్బులు లేవని చెప్పటంతో నిధుల దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్నారు. నిధుల నిల్వ, వ్యయంపై స్పష్టత లేకపోవటంతో.. శుక్రవారం నాటి పాలక వర్గ సభ్యులు సమావేశం ఆపేసి బహిష్కరించి వెళ్లిపోయారు. సీఈవోను సరెండర్ చేయాలని, ఉద్యోగం నుంచి తొలగించాలని పాలక వర్గం డిమాండ్ చేస్తోంది.

భారీగా నిధుల దుర్వినియోగం..

ఆరు నెలల క్రితం కుంటాల సహకార సంఘంలో ఎరువులు, విత్తనాలు విక్రయించగా.. సహకార సంఘం ఖాతాలో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నారు. రూ.26లక్షల నిధులు దుర్వినియోగం చేశారని.. దీంతో అప్పటి సీఈవోను సస్పెండ్ చేశారు. రికవరీకి ఆదేశించగా.. కొన్ని డబ్బులు కట్టారు. వేరే వారికి సీఈవో బాధ్యతలు అప్పగించారు.

Tags:    

Similar News