కొడకా.. నన్ను ఇంటికి తీసుకుపో.. బతిమిలాడుతున్న మల్లు స్వరాజ్యం
దిశ, తుంగతుర్తి: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ మల్లు.. Latest Telugu News..
దిశ, తుంగతుర్తి: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. వారం రోజుల క్రితం కోలుకున్నట్లే కోలుకొని చివరికి రెండు రోజుల నుండి పరిస్థితి క్రమ క్రమంగా క్షీణిస్తోంది. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరుతుండటం, డాక్టర్లు పైపుల ద్వారా తీసివేయడం లాంటివి జరుగుతున్నాయి. అయితే దీనిపై డాక్టర్లు కూడా వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 1న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో స్వరాజ్యంను చికిత్స నిమిత్తం బంధువులు చేర్పించారు. ఆస్పత్రిలో చేరగానే తొలుత వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్ ఆమె గొంతుపై ప్రభావం చూపింది.
దీంతో గొంతు ద్వారా ఆహారాన్ని తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ముక్కు ద్వారా వేసిన పైపుల నుండి ఆహారాన్ని ద్రవ రూపంలో పంపిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీ, గుండె, ఊపిరితిత్తుల సమస్యల పరిస్థితులతో ఆమె రోజురోజుకు శక్తిని కోల్పోతుంది. అంతకుముందు తనను పరామర్శించడానికి వచ్చేవారిని గుర్తుపట్టడం, కొద్దికొద్దిగా తచ్చాడుతూ మాట్లాడడం తదితరవి చేస్తుండడంతో స్వరాజ్యం క్రమేపీ కోలుకుంటున్నట్లు బంధువులతో పాటు ఆమెను పరామర్శించిన వారు భావిస్తూ వచ్చారు.
కొడుకా.. నన్ను ఇంటికి తీసుకు వెళ్ళండి..!
తనను ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకువెళ్లాలనే తాపత్రయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు స్వరాజ్యం కుమారుడు మల్లు నాగార్జున రెడ్డి శుక్రవారం రాత్రి "దిశ"కు తెలిపారు. చేతులతో సైగలు మాత్రమే చేస్తూ తన విషయంలో "మీరు ఏమాత్రం బాధపడవద్దు" అనే సంకేతాన్ని అమ్మ స్వరాజ్యం ఇస్తోందని ఆయన గద్గద స్వరంతో విచారంగా తెలిపారు. ముఖ్యంగా తల్లిని పరామర్శించే వారి తాకిడి ఎక్కువగా ఉంటున్న దృష్ట్యా ఆస్పత్రిలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని,ఈ మేరకు వచ్చేవారిని బయటనే నిలుపుదల చేస్తున్నామని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి,తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి స్వరాజ్యంను పరామర్శించారు.త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.