ఉదయం తీశారు.. సాయంత్రం వేశారు.. ఆ ఫోన్ కాల్‌తోనే మళ్లీ..?

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా ఓడెడు మానేరు నదిపై అక్రమంగా ఏర్పాటు చేసిన టోల్- latest Telugu news

Update: 2022-03-09 14:27 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా ఓడెడు మానేరు నదిపై అక్రమంగా ఏర్పాటు చేసిన టోల్ దందాపై అధికారులు కన్నెర్ర చేశారు. బుధవారం 'దర్జాగా టోల్ దందా' అనే శీర్షికతో 'దిశ' దిన పత్రికలో వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనితో వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించి హుటాహుటిన ఓడెడ్ మానేరు నది వద్దకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన టోల్ గేటును తొలగించారు. తహసీల్దార్ సుధాకర్ ఆదేశాల మేరకు ఆర్‌ఐ రాజిరెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి టోల్ గేటును తొలగించి దాదాపు మూడు గంటల సేపు అక్కడే ఉన్నారు. ఆ ప్రాంతం మీదుగా వచ్చిన వాహనాల నుండి టోల్ ఫీజు వసూలు చేయకుండా నిలువరించారు. అలాగే టోల్ రసీదు బుక్కులను స్వాధీనం చేసుకున్నారు.

సాయంత్రం మ్యాజిక్..

మధ్యాహ్నం వరకూ జరిగిన టోల్ అక్రమ వసూళ్ల పర్వానికి తెరపడగా.. సాయంత్రానికి సీన్ అంతా మారిపోయింది. మళ్లీ టోల్ నిర్వహకులు యథావిధిగా టోల్ ట్యాక్స్ వసూలు చేయడం ఆరంభించారు. పొలిటికల్ లీడర్ల ఎంట్రీతోనే అధికారులు వెనక్కి తగ్గారన్న ప్రచారం జరుగుతోంది. అధికారులకు వచ్చిన ఓ ఫోన్ కాల్‌తో బుధవారం సాయంత్రం నుండి మళ్లీ టోల్ గేట్ ఏర్పాటు చేసి వసూలు చేస్తున్న తీరుతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు వెళ్లిపోయిన తరువాత కొద్దిసేపు తాడు వేసి టోల్ వసూలు చేశారని.. సాయంత్రం నిర్భయంగా టోల్ బూత్ ఏర్పాటు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. అక్రమంగా సాగుతున్న ఈ తతంగాన్ని నిలువరించేందుకు అధికారులు ఎందుకు వెనకాడుతున్నారోనన్న చర్చ మొదలైంది. ఉన్నతాధికారులు టోల్ అక్రమ వసూళ్లపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News