ఏఐసీసీ బాధ్యతలు రాహుల్ చేపట్టాలని సీఎల్పీ తీర్మాణం
దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ కుటుంబం - CLP decides Rahul to take over AICC responsibilities
దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ కుటుంబం వల్లే కపిల్ సిబాల్ వంటి నాయకులు కేంద్ర మంత్రులు అయ్యారని, వారి త్యాగాలతో పదవులు అనుభవించి ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాజ్యంగ స్పూర్తిని, దేశాన్ని రక్షించడం కోసం ఏఐసీసీ బాధ్యతలను యువనేత రాహుల్‌గాంధీ స్వీకారించాలని సీఎల్పీ ఏకగ్రీవంగా తీర్మాణం చేసిందని వెల్లడించారు. గాంధీ, నెహ్రు కుటుంభం మాత్రమే కాంగ్రెస్ పార్టీని కాపాడుతుందన్నారు.
వీరి నాయకత్వమే ఇప్పడు దేశానికి అవసరం ఉందని వివరించారు. మత చాంధసవాదులు జాతిని విచ్ఛిన్నం చేసేందుకు దేశంలో పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో లౌకికవాదంతో దేశాన్ని, రాజ్యంగ స్పూర్తిని పరిరక్షించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. దేశంలో అనేక రకాల విధ్వంస చర్యలు, మత పరమైన హింసలు జరుగుతున్నాయని, దేశాన్ని కాపాడలంటే యువనేత రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలని సీఎల్పీ ఏకాగ్రీవంగా తీర్మాణం చేసిందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమన్నారు. రాహుల్ గాంధీ వెంటనే ఏఐసీసీ బాధ్యతలు స్వీకరించాలని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్షం విజ్ఞప్తి చేస్తున్నదని తెలిపారు. ప్రధాని అవ్వడానికి అవకాశం వచ్చిన ఏ పదవులు ఆశించకుండా రాహుల్ గాంధీ దేశం కోసం ఇంతకాలం పని చేశారని కొనియాడారు. ఈ సమావేశానికి ఎమ్మేల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలు హాజరైనారు.
పంజాబ్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ఉండవు..
పంజాబ్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ఉండవన్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. 1970లో కాంగ్రెస్ అధికారం కోల్పోయి 1980లో తిరిగి పూర్వవైభవం సంతరించుకున్నట్టు 2023లో కాంగ్రెస్ హావా దేశంలో వీస్తుందని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధీనేత్రి సోనియా గాంధీ ఇచ్చిన ఆదేశాలను ఆహ్వనిస్తున్నామని చెప్పారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలంగా వుందని అన్నారు.