రాష్ట్రంలో 99,984 ఉద్యోగాలు మాయం.. ఆ నివేదికలో బట్టబయలు!

దిశ, తెలంగాణ బ్యూరో: పీఆర్సీ నివేదికకు, ముఖ్యమంత్రి ప్రకటనకు పొంతన కుదరడం లేదు. రాష్ట్రంలో బిశ్వాల్ కమిషన్ తేల్చిన ఖాళీలు, సీఎం చెప్పిన ఖాళీలకు మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపిస్తున్నది.

Update: 2022-03-10 02:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పీఆర్సీ నివేదికకు, ముఖ్యమంత్రి ప్రకటనకు పొంతన కుదరడం లేదు. రాష్ట్రంలో బిశ్వాల్ కమిషన్ తేల్చిన ఖాళీలు, సీఎం చెప్పిన ఖాళీలకు మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపిస్తున్నది. సుమారు లక్షకు పైగా ఉద్యోగాలు ఎటు పోయాయనే ప్రశ్న తలెత్తుతున్నది. పెద్ద ఎత్తున పోస్టులను ఎత్తివేశారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తుండగా, ప్రభుత్వం నుంచి క్లారిటీ కరువైంది. రాష్ట్రంలో సుమారు లక్ష ఉద్యోగాలు మాయమయ్యాయి. సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో చేసిన ప్రకటన నేపథ్యంలో పీఆర్సీ నివేదిక మరోసారి తెరపైకి వచ్చింది. దాదాపు మూడేండ్లు పని చేసిన బిశ్వాల్ కమిషన్ అన్ని శాఖల నుంచి వివరాలు సేకరించింది. విభాగాల వారీగా సమగ్రంగా నివేదిక ఇచ్చింది. పీఆర్సీ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో 1,91,126 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. తాజాగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలన్నింట్లో 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వాటిలో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నామని వివరించారు. 80,039 పోస్టులకు నోటిఫికేషన్లు వేయనున్నట్లు ప్రకటించారు.

ఉద్యోగాలు ఎటుపోయినట్టు..?

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు ఎలా మాయమయ్యాయనేది ఇప్పుడు నిరుద్యోగులతో పాటు రాష్ట్రంలోని విపక్షాలను వేధిస్తున్న ప్రశ్న. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 39% పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిశ్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలోని పీఆర్సీ కమిటీ నివేదికలో వెల్లడించింది. మొత్తం 4,91,304 పోస్టులు సాంక్షన్డ్ స్ట్రెంత్ కాగా.. ప్రస్తుతం 3,00,178 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు ఆ కమిటీ తేల్చింది. ఇంకా 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని రిపోర్టులో పేర్కొంది. ఇప్పుడు ప్రభుత్వ నివేదికలో మాత్రం 91,142గా తేల్చారు. ఇంకా 99,984 ఉద్యోగాల గురించి తేలడం లేదు. ఒకవేళ ఇవన్నీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేశారనుకున్నా ఈ కేటగిరిలో 1.20 లక్షల మంది పని చేస్తున్నట్లు పీఆర్సీ నివేదికల్లోనే తేల్చారు. దీని ప్రకారం వీరు చేస్తున్న పోస్టులను భర్తీ చేసినట్లుగానే చూపించారు. ఒకవేళ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న వారిని కాదని, ఈ పోస్టులను కూడా ఖాళీలుగా చూపిస్తే ఆ సంఖ్య మూడు లక్షలు దాటుతుందనే అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి. పీఆర్సీ నివేదిక ప్రకారం ఇప్పుడు 99,984 ఉద్యోగాలు ఏమయ్యాయో అంతు చిక్కని రహస్యంగా మారింది. డ్రైవర్లు, స్కావెంజర్లు, అటెండర్లు, స్వీపర్లు వంటి పోస్టులను ఎత్తివేశారని, వాటిని ఖాళీలుగా చూపించడం లేదని ఉద్యోగ సంఘాలు చెబుతుండగా, వాటిపై ప్రభుత్వం తరపున ఎక్కడా క్లారిటీ ఇవ్వడం లేదు.

పీఆర్సీ నివేదిక ప్రకారం కొన్నిఖాళీల వివరాలు

స్కూల్ ఎడ్యుకేషన్    =   23,798

పోలీస్                 =        37,182

వైద్యారోగ్యం          =       30,570

రెవెన్యూ             =          7961

పంచాయతీరాజ్     =    12628

మిగతా శాఖల్లో       =      78,987

మొత్తం               =        1,91,126


Tags:    

Similar News