Mayawati: రసవత్తరంగా రాష్ట్రపతి ఎన్నిక.. అదును చూసి దెబ్బకొట్టిన BSP చీఫ్

BSP Chief Mayawati Announces Support For NDA's Candidate Draupadi Murmu| రాబోయే రాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు.

Update: 2022-06-25 06:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: BSP Chief Mayawati Announces Support For NDA's Candidate Draupadi Murmu| రాబోయే రాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. శుక్రవారం మాయవతితో ద్రౌపది ముర్ము సంప్రదింపులు జరిపారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తామని మాయావతి శనివారం ప్రకటించారు. 'తాము బీజేపీకి గానీ, ఎన్డీయేకి గాని మద్దతు ఇవ్వడం లేదని పార్టీ విధానాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని.. అలాగని తాము ప్రతిపక్షాలకు వ్యతిరేకం కాదని' స్పష్టం చేశారు.

ప్రతిపక్షాలకు దెబ్బేసిన మాయావతి?

ఎన్డీయే అభ్యర్థికి మద్దతు తెలిపిన మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్దతు విషయంలో ప్రతిపక్షాలు తమను సంప్రదించలేదని తెలిపారు. అయితే, అంతకు ముందు ఉమ్మడి అభ్యర్థి ఖరారు విషయంలో ప్రతిపక్షాలు మాయావతిని సంప్రదించకపోవడంతో ఆమె అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన మొదటి సమావేశానికి కొన్ని ఎంపిక చేసిన పార్టీలను మాత్రమే ఆహ్వానించారు. ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సైతం బీఎస్పీకి పిలుపురాలేదు. దీంతో ప్రతిపక్షాల తీరుపై మాయావతి కోపంతో ఉన్నారని తెలుస్తోంది. ప్రతిపక్షాలు తమ పార్టీకి వ్యతిరేకంగా కులతత్వ ధోరణిని కొనసాగిస్తున్నందున రాష్ట్రపతి ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడానికి బీఎస్పీ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని మాయావతి తాజాగా కామెంట్స్ చేశారు. అణగారిన వర్గాలకు అనుకూలంగా నిర్ణయాలు ఏ పార్టీ తీసుకున్నా వారికి మద్దతు ఇస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే విపక్షాల పోకడలకు నిరసనగా అదును చూసి ఉమ్మడి అభ్యర్థిని కాకుండా ఎన్డీయే అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News