లక్నో: వారణాసిలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీని బీజేపీ మద్దతుదారులు అడ్డుకోవడంపై ఆమె స్పందించారు. ఓటమి భయంతోనే కాషాయ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. 'నేను చాలాసార్లు ఇలాంటి దాడులు ఎదుర్కొన్నాను. కానీ ఎప్పుడూ ఎవ్వరి ముందు తలవంచలేదు. నేను పిరికిపందను కాదు. నేను యోధురాలిని. వారు కర్రలతో నా కాన్వాయ్‌పై దాడి చేసి వెనక్కి వెళ్లమన్నారు. బీజేపీ ఓటమి భయంతోనే ఇలా చేస్తుందని నాకు అర్థమయ్యింది' అని వారణాసి ర్యాలీలో అన్నారు. 'వారణాసి లోకి రాగానే బీజేపీ కార్యకర్తలు నాపై దాడికి ప్రయత్నించారు. వారికి అధికారాన్ని కోల్పోతున్నారనే భయం ఉంది' అని తెలిపారు. కాగా, బుధవారం సాయంత్రం దశాశ్వమేధ ఘాట్‌లో గంగా హారతి పాల్గొనేందుకు వెళ్లిన మమతాకు చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ మద్దతుదారులు నల్ల జెండాలు పట్టుకుని మమతాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తనకు కేటాయించిన సీట్లను వదిలేసి మమతా అక్కడే ఉన్న మెట్ల పై కూర్చుని నిరసన తెలిపింది.