నువ్వు సీపీవా? గూండావా? రిటైర్మెంట్ తర్వాత కుక్కలు కూడా దేకవు : బండి ఫైర్

నిజామాబాద్ సీపీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Update: 2022-03-20 15:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నిజామాబాద్ సీపీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బోధన్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని టీఆర్ఎస్​నేతలు అడ్డుకుని హిందూ వాహిని, భజరంగ్​దళ్​నేతలపై దాడులు చేస్తుంటే వారిపై కాకుండా హిందు వాహిని, భజరంగ్​దళ్​నేతలపై ముస్లిం చాందసవాదులు, పోలీసులు కలిసి దాడి, లాఠీఛార్జ్ చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అసలు నువ్వు సీపీవా? గుండావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

బోధన్ చౌరస్తాలో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు మున్సిపల్ అధికారులు అనుమతిచ్చారని, విగ్రహం ఏర్పాటు చేశాక కూడా రాళ్ల దాడులు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. సమస్యలు వస్తే సామరస్యంగా పరిష్కరించాల్సిన పోలీసులు లాఠీచార్జీ, రబ్బర్​బుల్లెట్లు ప్రయోగించడమేంటని ప్రశ్నించారు. అదీగాక అక్కడి సీపీ అనరాని బూతులు మాట్లాడటం ఘోరమని మండిపడ్డారు. ఈ సీపీ గతంలో తనకు ఎంపీగా ఛాన్స్ ఇచ్చారని చెప్పాడని, ప్రభుత్వం ఇలాంటి వారికి అండగా నిలుస్తోందని ధ్వజమెత్తారు. సీపీకి కొంచెమైనా సిగ్గుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న సీపీ పదవీ విరమణ పొందాక ఆయన్ను కనీసం కుక్కలు కూడా దేకవని ఘాటుగా స్పందించారు. ఇంటికి వెళ్లి కుటుంబీకులకు హనుమాన్ భక్తులను కొట్టానని సీపీ చెప్పాలని, వాళ్ళు మంచి పని చేశారంటారో? ఎందుకు కొట్టారంటారో వినాలని బండి సంజయ్​పేర్కొన్నారు.ఛత్రపతి శివాజీ ఏమన్నా పాకిస్థాన్ నుంచి వచ్చాడా? విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు తాగి అధికారులు ఇలాంటి దాడులు చేస్తున్నారని, సీఎంతో శభాష్ అనిపించేందుకు సీపీ తహతహలాడుతున్నాడని చురకలంటించారు. చట్టాన్ని కాపాడలేని సీపీకి డ్యూటీ చేతకాకుంటే వెళ్లి వేరే పని చేసుకుంటే మంచిదని, అసలు ఆయనకు పోలీస్ ఉద్యోగం ఎందుకంటూ ధ్వజమెత్తారు. ఉద్యోగం నుంచి దిగితే సీపీ బతుకు బర్ బాద్ అవుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఇవ్వాళ జరిగిన ఘర్షణ సంగతి అసలు హోంమంత్రి మహమ్మూద్​అలీకి తెలుసో లేదో.. అని సెటైర్లు వేశారు. ఆయన రోహింగ్యాలు వస్తే రిబ్బన్ కట్ చేసి స్వాగతించడం తప్పా ఏమీ తెలియదని మండిపడ్డారు. హోంమత్రి భైంసా సమయంలోనూ స్పందించలేదని, ఇప్పుడు కూడా స్పందించడన్నారు.

టీఆర్ఎస్​నేతలకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్​వర్తిస్తుందని, ఇతరులకు వర్తించట్లేదని పేర్కొన్నారు. పోలీస్​స్టేషన్లు టీఆర్ఎస్​నేతల దందాలకు అడ్డాగా మారాయని బండి సంజయ్​ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలందరికీ బీజేపీ అండగా ఉంటుందని, ఎవరూ భయపడొద్దని భరోసానిచ్చారు. నిజామాబాద్​సీపీపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బండి సంజయ్​డిమాండ్​చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాంహౌజ్​కు ఎమ్మెల్యేలు, మంత్రులను ఆగమేఘాలపై పిలుచుకున్నాడని, ఇప్పుడు మళ్లీ ఢిల్లీకి వెళ్లి ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని అడిగేందుకు బయల్దేరాడని, ఇన్ని అబద్ధాలు.. చెప్పే కేసీఆర్ ది నోరా.. తాటి మట్టా అంటూ బండి సంజయ్​విరుచుకుపడ్డారు. హుజురాబాద్ ఎన్నికల సమయంలో వరి వేస్తే ఉరి అన్నాడని, అయినా అక్కడి ప్రజలు ఆయన్ను నమ్మలేదని, ఈటలను గెలిపించి కేసీఆర్​కు గట్టి దెబ్బ కొట్టారన్నారు. తననెవ్వరూ టచ్ చేయలేరని సీఎం అంటాడని, మళ్ళీ ఆయనే తన మెడపై కేంద్రం కత్తి పెట్టి బాయిల్డ్ రైస్ విషయంలో ఒప్పందం చేసుకుందని అబద్ధాలు చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వరిధాన్యం కొనకుంటే వడ్లు తీసుకొచ్చి బీజేపీ ఆఫీస్ ఎదుట పోస్తానని చెప్పిన ముఖ్యమంత్రికి ఇంకా టిప్పర్ దొరకలేదేమోనంటూ సెటైర్లు వేశారు.

ధాన్యం కొంటామనే విషయాన్ని కేంద్రమంత్రి పీయూష్​గోయల్​పార్లమెంట్ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తామని ఒప్పుకున్నంత ధాన్యాన్ని కూడా ఇప్పటి వరకు అందించలేదని, కావాలనే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నాడని బండి సంజయ్​ఆగ్రహం వ్యక్తంచేశారు. వానాకాలంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని, అయితే ఇంకా ఎక్కువ పంట వచ్చిందని చెబితే మరో 24 లక్షల టన్నుల ధాన్యం ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించి రాష్ట్రానికి లెటర్ రాసినా.. అంతమేర ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వం అందించలేదని బండి తెలిపారు. ఇటీవల ఫిబ్రవరిలో అన్ని రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహిస్తే ఈసారి తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరించడంలేదని, కాబట్టి ధాన్యం ఎఫ్ సీఐకి ఇవ్వడంలేదని చెప్పారని, ఇది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికైనా రైతులు అర్థం చేసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై కావాలనే నిందలు మోపాలని చూస్తోందని సూచించారు. కేసీఆర్ ధాన్యం కొనుగోలు విషయంలో తప్పు చేశాడని, క్రమంగా ఈ ఉచ్చులో చిక్కుకున్నాడని, వాటి నుంచి తప్పించుకునేందుకే ఢిల్లీ అంటూ డైవర్ట్ చేస్తున్నాడని బండి పేర్కొన్నారు. టీఆర్​ఎస్​ఎంపీలు పార్లమెంట్​క్యాంటీన్ లో చాయ్ తాగి నిరసన తెలిపామని చెప్పుకున్న నీచులని మండిపడ్డారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను రాష్ట్రానికి రావాల్సిందిగా కోరామని, త్వరలోనే వారి షెడ్యూల్​ఖరారవుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఎల్లారెడ్డిపేట బాధితులకు బండి ఫోన్

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో టీఆర్ఎస్ నేతల దాడిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలకు రాష్ట్ర నాయకత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబీకులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్​చేసి మాట్లాడారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. తొలుత పార్టీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ నాయకులు, సిరిసిల్ల జిల్లా బీజేపీ నాయకులతో బండి సమావేశమయ్యారు. సోమవారం ఉదయం బీజేపీ లీగల్ సెల్ కు చెందిన 50 మంది ప్రతినిధుల బృందం సిరిసిల్ల జిల్లాకు వెళ్లనుంది.

Tags:    

Similar News