'అరెస్టులు చేసినా.. కేసులు పెట్టినా.. తగ్గేదేలే..': బీజేపీ

దిశ, కామారెడ్డి రూరల్ : అరెస్ట్ చేసినా, కేసులు పెట్టినా తాము వెనక్కి తగ్గేది లేదని, డబుల్ ఇళ్లను.. Latest Telugu News..

Update: 2022-04-01 12:17 GMT

దిశ, కామారెడ్డి రూరల్ : అరెస్ట్ చేసినా, కేసులు పెట్టినా తాము వెనక్కి తగ్గేది లేదని, డబుల్ ఇళ్లను పేదలకు ఇచ్చే వరకు పోరాటం ఆపేది లేదని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన డబుల్ ఇళ్ల ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం 9 గంటలకు సుమారు 4 వేల మందితో ధర్నా చేపట్టాలని, కార్యకర్తలందరూ జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో నిర్మించిన డబుల్ ఇళ్ల వద్దకు చేరుకోవాలని వెంకట రమణారెడ్డి కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. గత ఐదు రోజుల క్రితం డబుల్ ఇళ్ల వద్ద బీజేపీ చేపట్టిన ఆందోళనను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం, ఇరువర్గాల మధ్య దాడులు చేసుకునే వరకు పరిస్థితులు వెళ్లడంతో శుక్రవారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బీజేపీ నాయకులను ఉదయం నుంచే ముందస్తుగా అరెస్టు చేయడం మొదలుపెట్టారు. డబుల్ ఇళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్కడ భారీ బందోబస్తు నిర్వహించారు. దాంతో నాయకులు, కార్యకర్తలు ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకుని అండర్ గ్రౌండ్‌కు వెళ్లారు. సరిగ్గా 10:30 గంటలకు ఓ చోట కలుసుకుని పోలీసుల వలయాన్ని ఛేదించుకుని, బారికేడ్లను తోసుకుని డబుల్ ఇళ్ల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దాంతో పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. వెంకట రమణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా మూడంచెల వలయంగా రమణారెడ్డికి కార్యకర్తలు రక్షణగా నిలిచారు.

పోలీసుల వాహనానికి అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. అనంతరం నాయకులను లాక్కెళ్లి పోలీసులు డీసీఎం వ్యానులోకి ఎక్కించారు. ఈ క్రమంలో డీసీఎం వ్యాను నుంచి ఇద్దరు కార్యకర్తలు కింద పడ్డారు. మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులకు, కార్యకర్తలకు జరిగిన తోపులాటలో మొత్తం ముగ్గురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వెంకట రమణారెడ్డి సహా నాయకులందరిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. రమణారెడ్డిని నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదలకు కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని శాంతియుతంగా చేపట్టిన ధర్నాను అరెస్టులతో నిలువరించడం సరికాదన్నారు. ఈ ప్రభుత్వానికి పేదల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. ఏడాది క్రితం కట్టిన డబుల్ ఇళ్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, వెంటనే వాటిని పేదలకు కేటాయించాలని ఐదు రోజల క్రితమే తాము హెచ్చరించామన్నారు. ఒకవేళ స్పందన రాకపోతే తామే సొంత ఖర్చులతో జేసీబీ, మిషన్లు తీసుకువచ్చి డబుల్ ఇళ్ల వద్ద శుభ్రం చేసి నీటి వసతి, ఇతర వసతులు కల్పించి అక్కడున్న ఇల్లు లేని పేదలకు అందజేస్తామని చెప్పినా.. ఇక్కడున్న ఎమ్మెల్యేకు చీమకుట్టినట్టు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. పేదల పక్షాన పోరాడుతున్న తమను అక్రమంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు.

Tags:    

Similar News