ఫామ్ హౌస్‌లో కేసీఆర్ మంత్రాలు చేస్తున్నాడు.. బండి సంజయ్ సంచలన ఆరోపణ
దిశ, ఎల్బీనగర్: రాష్ట్రంలో గో రక్షక్ చట్టాన్ని అమలు చేస్తారా లేదా? అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.
దిశ, ఎల్బీనగర్: రాష్ట్రంలో గో రక్షక్ చట్టాన్ని అమలు చేస్తారా లేదా? అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. మంగళవారం కర్మన్ ఘాట్‌లోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల కర్మన్ ఘాట్‌లో గో రక్షక్‌లపై జరిగిన దాడుల నేపథ్యంలో, గో రక్షక్‌లకు భరోసా కల్పించేందుకు ఆయన కర్మన్ ఘాట్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. గోవులను అక్రమంగా తరలిస్తున్నవారిని అడ్డుకోవాల్సిన పోలీసులు గో-రక్షకుల్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గోరక్షకులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ హోమాలు, యజ్ఞాలు చేస్తే సరిపోదని విమర్శించారు. గోవులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎదుటి వాళ్లు నాశనం అవ్వాలంటూ కేసీఆర్ ఫామ్ హౌస్‌లో యాంత్రిక, తాంత్రిక పూజలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం ఎన్ని తాంత్రిక పూజలు చేసిన అది తనకే చుట్టుకుంటుందన్నారు. అధికారుల వత్తిడి వల్లే పని చేయలేకపోతున్నామని పోలీసులు బాధపడుతున్నారని తెలిపారు. ఆయన వెంట బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి, చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి, బీజేపీ నాయకులు ఉన్నారు.