బయోనిక్ EYE.. అతిపెద్ద సవాల్‌గా మారిన ఇంప్లాంటేషన్
దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ ఎంత గొప్పదైనా, సృష్టి వింతలకే నకలు తయారు చేసే సామర్థ్యమున్నా.. Latest Telugu News..
దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ ఎంత గొప్పదైనా, సృష్టి వింతలకే నకలు తయారు చేసే సామర్థ్యమున్నా.. సైన్స్‌కు అందని సవాళ్లు, సమాధానంలేని ప్రశ్నలు తారసపడుతూనే ఉంటాయి. కానీ పురోగతి క్రమంలో ప్రతి చిక్కుముడికి ప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటివరకు నయం చేయలేని, జన్యుపరమైన లోపాలకు కూడా పరిష్కారం కనుగొంటున్నారు. పుట్టుకతోనే కంటిచూపు లేనివారికి కూడా చూపు తెప్పించే దిశగా అడుగులేస్తున్నారు. ఇన్నాళ్లు కళ్లదానం ద్వారానే శాశ్వత అంధులకు చూపు కల్పించగా.. సాధ్యాసాధ్యాలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలోనే వెలుగులోకి వచ్చిన 'బయోనిక్ ఐ'.. అన్ని రకాల కంటి చూపు బాధితులకు ఆశాకిరణంగా కనిపిస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ ప్రజలు అంధత్వంతో బాధపడుతున్నారు. మరో 135 మిలియన్ పీపుల్ ఇతరత్రా కంటిచూపు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి వీరందరికీ 'బయోనిక్ ఐ టెక్నాలజీ' పరిష్కారం చూపగలదా?
ఒక ఆరోగ్యకరమైన కన్ను.. కనుపాప(నల్లని భాగం) ద్వారా కాంతిని గ్రహిస్తుంది. ఒక లెన్స్ ఆ కాంతిని కంటి వెనుక భాగంలో కేంద్రీకరిస్తుంది. ఇక్కడ రెటీనాగా పిలువబడే సున్నితమైన కణజాలానికి చెందిన మందపాటి పొర ఉంటుంది. 'ఫోటోరిసెప్టర్స్' అని పిలువబడే కణాలు కాంతిని విద్యుత్ సంకేతాలుగా మారుస్తాయి. ఇవి ఆప్టిక్ నరాల నుంచి మెదడుకు ప్రయాణిస్తాయి. ఇది ఆ చిత్రాల గురించి వివరిస్తుంది. కానీ తరచుగా డీజనరేటివ్ డిసీస్‌లు సంభవించినపుడు ఆ వ్యవస్థలోని కొంత భాగానికి అంతరాయం ఏర్పడుతుంది. ఇది రెటీనా భాగాలను దెబ్బతీస్తుంది. అయితే మిస్ అయిన లేదా దెబ్బతిన్న ప్రక్రియలో అంతరాన్ని తగ్గించే దిశగా ఈ సాంకేతికత అడుగులు వేస్తోంది.
బయోనిక్ ఐ టెక్నాలజీ..
మాంచెస్టర్ విశ్వవిద్యాలయం ప్రకారం 2009లో U.K.లోని మాంచెస్టర్, మూర్‌ఫీల్డ్స్ హాస్పిటల్‌లోని సర్జన్లు రెటినిటిస్ పిగ్మెంటోసాతో బాధపడుతున్న రోగులకు ఆర్గస్ II బయోనిక్ కంటికి సంబంధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రయల్‌ను అందించారు. చూపు కోల్పోయిన పది మంది రోగులకు ఈ పరికరాలను అమర్చారు. ఇవి ఆర్గస్ II రోగులకు ఆకారాలు, నమూనాలను గుర్తించడంలో సాయపడ్డాయి. 2013లో, U.S. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ పరికరాన్ని చట్టబద్ధంగా ఆమోదించింది.
అభివృద్ధిలో కీలక అడుగు
అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీ (ACM) ప్రకారం, బయోనిక్ ఐ టెక్నాలజీ అభివృద్ధి కొనసాగుతోంది. 2021లో USC కెక్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు హ్యూమన్ రెటీనా నమూనా తయారీకోసం అధునాతన కంప్యూటర్ మోడల్‌ను రూపొందించారు. ఇది మిలియన్ల కొద్దీ నాడీ కణాల ఆకారాలు, స్థానాలను ప్రతిబింబిస్తుంది. అంతేకాదు ఈ సాంకేతికతకు కలర్ విజన్‌తో పాటు మెరుగైన స్పష్టత తీసుకొచ్చేందుకు సాయపడుతుంది. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, UNSW శాస్త్రవేత్తలు ఇటీవల గొర్రెల్లో ఫీనిక్స్ 99 'బయోనిక్ ఐ'ని విజయవంతంగా పరీక్షించారు. ఈ పరికరాన్ని అమర్చిన తర్వాత ఆ ప్రభావం నుంచి ఎలా నయం అవుతుందో తెలుసుకున్నారు. ఎటువంటి ప్రతిచర్యలు గుర్తించబడనందున ఇది చాలా ఏళ్ల పాటు సురక్షితమేనని భావిస్తున్నారు. దీంతో మానవ పరీక్షలకు మార్గం సుగమమైంది. అయితే పరిమాణంలో స్థూలంగా ఉండే బయోనిక్ కళ్ల సాంకేతికతను ఇంప్లాంట్ చేయడమే అతిపెద్ద సవాల్. ఈ మేరకు చైనాలోని హార్బిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నార్తంబ్రియా యూనివర్సిటీలోని శాస్త్రవేత్తలు బయోనిక్ కళ్లలోని సినాప్టిక్ పరికరాలను నియంత్రించేందుకు ఇటీవలే 'లో పవర్ సిస్టమ్'ను అభివృద్ధి చేసి బ్రేక్ త్రూ సాధించారు.
ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి..
అసోసియేషన్ ఆఫ్ ఆప్టోమెట్రిస్ట్స్ ప్రకారం 2009లో బయోనిక్ కన్ను పొందిన మొదటి వృద్ధుడు కీత్ హేమాన్. 20 ఏళ్ల వయసులో రెటినిటిస్ పిగ్మెంటోసా వ్యాధికి గురైన అతను చాలా ఏళ్ల తర్వాత చూపు కోల్పోయాడు. మాంచెస్టర్ రాయల్ ఐ హాస్పిటల్‌లో బయోనిక్ కన్ను అమర్చిన తర్వాత వెలుతురు, చీకటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడంతోపాటు కదిలే వ్యక్తులను చూడగలిగాడు. ఈ మేరకు తన అనుభవాలను పంచుకున్న హేమాన్.. 'నేను నా మనవళ్లను మొదటిసారి చూడగలిగాను. వారు నన్ను చూడడానికి వచ్చినప్పుడు తెల్లటి టీ-షర్టులు ధరిస్తారు. వారు ఎలా కనిపిస్తారనే విషయం గురించి నేను ఎక్కువ చెప్పలేను కానీ కనీసం వారు వస్తున్నట్లుగా గుర్తించగలుగుతున్నాను' అని చెప్పాడు.