చక చక నిమ్జ్‌ రోడ్డు పనులు…విద్యుత్ వెలుగులతో రోడ్డు "జిగేల్"

నిమ్జ్‌ పరిశ్రమల కోసం నూతనంగా ఏర్పాటు చేస్తున్న రోడ్డు విద్యుత్ దీపాలతో మెరిసిపోతుంది.

Update: 2024-11-25 10:39 GMT

దిశ, ఝరాసంగం : నిమ్జ్‌ పరిశ్రమల కోసం నూతనంగా ఏర్పాటు చేస్తున్న రోడ్డు విద్యుత్ దీపాలతో మెరిసిపోతుంది. జహీరాబాద్ ప్రాంతంలోని జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్‌) ప్రాంతానికి మౌలిక వసతుల కల్పనలో భాగంగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణం రెండు వైపులా రోడ్డు పనులు తుది దశకు చేరుకున్నాయి. జహీరాబాద్ మండలం హుగ్గేల్లి నుంచి ఝరాసంగం మండలం బర్దిపూర్ శివారు వరకు రూ.100 కోట్ల తో 9 కిలోమీటరులు వంద అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారు. ఇప్పటికే రోడ్డు మధ్యలో డివైడర్ పనులు పూర్తి చేశారు. రోడ్డు మార్గంలో అక్కడక్కడ 13 చోట్ల వంతెన నిర్మించారు. హుగ్గేల్లి క్రాస్ రోడ్ నుంచి కృష్ణాపూర్, మాచునూర్, బర్దిపూర్ వరకు నిర్మించిన రోడ్డు మధ్యలో సుమారుగా 400 స్ట్రీట్ స్తంభాలను ఏర్పాటు చేశారు. వాటికి విద్యుత్ దీపాలను అమర్చారు.

ట్రయల్ రన్ కోసం రాత్రి ఆన్ చేశారు. దీంతో రోడ్డు మార్గం విద్యుత్ కాంతులతో జిగేల్ మంటుంది. హుగ్గేల్లి నుంచి బర్దిపూర్ వరకు రైతులు వెళ్లే మార్గాలు నిర్మించలేదు. రైతులు వెళ్లే రోడ్డు మార్గాలను వెంటనే మరమ్మతులు చేపట్టాలని బర్దిపూర్, మాచునూర్, కృష్ణాపూర్ రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రోడ్డు నిర్మాణం కోసం రైతుల నుంచి 65 ఎకరాల భూమిని సేకరించారు. రోడ్డులో భూములు కోల్పోయిన ఒక్కొక్క రైతుకు ఇంటి నిర్మాణం కోసం స్థలం, ఉద్యోగ హామీ పత్రాన్ని ఇప్పటివరకు ఇవ్వలేదని తక్షణమే వాటిని ఇవ్వాలని రైతులు ప్రభుత్వానికి కోరారు. ఇప్పటికే నిర్మాణమైన రోడ్డుపై పొట్టి పల్లి, ఎల్గోయి, బర్దిపూర్, చిలేపల్లి, చిలేపల్లి తండా తదితర ప్రాంతాల ప్రజలు ప్రయాణాలు కొనసాగిస్తున్నారు.


Similar News