అరుదైన వ్యక్తిగత విషయాన్ని పంచుకున్న బిల్‌గేట్స్..
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని టాప్ 5 బిలియనీర్స్‌లో ఒకరైన మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తనకు సంబంధించిన అరుదైన విషయాన్ని లింక్డ్ఇన్‌లో షేర్ చేసుకున్నారు.
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని టాప్ 5 బిలియనీర్స్‌లో ఒకరైన మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తనకు సంబంధించిన అరుదైన విషయాన్ని లింక్డ్ఇన్‌లో షేర్ చేసుకున్నారు. 48 ఏళ్ల క్రితం తాను తయారుచేసుకున్న రెజ్యూమె పోస్ట్ చేసి, యువతకు గొప్ప సందేశాన్ని కూడా అందించాడు.
చదువులు పూర్తయ్యాక యువత ఉద్యోగాన్వేషణలో కీలక పాత్ర పోషించేది రెజ్యూమె. దీని ప్రిపరేషన్ కోసం ప్రస్తుతం యూట్యూబ్‌లో లెక్కలేనన్ని వీడియోలు అందుబాటులో ఉండగా.. ఎడ్‌టెక్ కంపెనీలు ఇందుకోసం ప్రత్యేకంగా ఓ క్లాస్ కూడా నిర్వహిస్తున్నాయి. అయితే దశాబ్దకాలంగా రెజ్యూమె ప్రిపరేషన్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. కాగా ఈ డాక్యుమెంట్ ప్రాధాన్యత తెలియజేస్తూ 1974 నాటి తన సీవీని లింక్డ్‌ఇన్ ఖాతాలో షేర్ చేశారు బిల్ గేట్స్. దీంతో పాటు 'మీరు రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అయినా లేదా కాలేజీ డ్రాపౌట్ అయినా 48 ఏళ్ల కిందటి నా రెజ్యూమె కంటే మీ డాక్యుమెంట్ చాలా బెటర్‌గా ఉందని అనుకుంటున్నాను' అని మెసేజ్ చేశాడు.
ఇక రెజ్యూమె ప్రిపేర్ చేసేనాటికి బిల్‌గేట్స్ వయసు 18 ఏళ్లు కాగా, తన పేరు విలియం హెచ్ గేట్స్‌గా పేర్కొన్నాడు. హార్వర్డ్ కాలేజీలో తొలి ఏడాది చదువుతున్నట్టు చెప్పాడు. ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్, డేటాబేస్ మేనేజ్‌మెంట్, కంపైలర్ కన్‌స్ట్రక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వంటి కోర్సులను అభ్యసించినట్లు రెజ్యూమెలో ప్రస్తావించాడు. గేట్స్ తన ఎత్తు, బరువుతో పాటు తనపై ఆధారపడిన వారు ఎవరూ లేరనే విషయాన్ని ఆసక్తికరంగా మెన్షన్ చేశాడు. FORTRAN, COBOL, ALGOL, BASIC మొదలైన ప్రోగ్రామింగ్ భాషల్లో తన అనుభవాన్ని కూడా పేర్కొన్న గేట్స్.. 1973లో TRW సిస్టమ్స్ గ్రూప్‌తో సిస్టమ్స్ ప్రోగ్రామర్‌గా పనిచేసినట్లు తెలిపాడు. అంతేకాదు 1972లో సీటెల్‌లోని లేక్‌సైడ్ స్కూల్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన కో-లీడర్, కోపార్ట్‌నర్‌గా పనిచేసిన అనుభవాన్ని జోడించాడు. అంతకంటే మెరుగైన మంచి ఉద్యోగం కోసం ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తన అనుభవాలకు అనుగుణంగా సహేతుకమైన జీతం పొందడానికి తాను సిద్ధంగా ఉంటానని పంచుకున్నాడు.
'మీ రెజ్యూమె పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇదొక గొప్ప రెజ్యూమె. మనం కూడా మన గత రెజ్యూమె కాపీలను భద్రపరుచుకోవాలి. కొన్నిసార్లు జీవితంలో మనం ఎంత సాధించామో మరచిపోతాం' అంటూ ఓ యూజర్ పోస్ట్ చేశాడు.