బస్తీవాసులకు గుడ్ న్యూస్.. పెరగనున్న వైద్యసేవలు
హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం 256 బస్తీ దవాఖానాలు ఉండగా, ఈ ఏడాది మరో 94 సెంటర్లను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం 256 బస్తీ దవాఖానాలు ఉండగా, ఈ ఏడాది మరో 94 సెంటర్లను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నది. వీటిని హెచ్ఎండీఏ పరిధిలో ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తున్నది. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరో 60 బస్తీ దవాఖానాలను కొత్తగా ప్రారంభించనున్నారు. వీటితో ఓపీతో పాటు సుమారు 57 రకాల పరీక్షలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నది. దీంతో పాటు కిడ్నీ రోగుల సౌకర్యార్ధం మరో 42 ఉచిత డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆసుపత్రుల మౌలిక వసతుల బడ్జెట్‌లో నిధులు పెంచారు.
ఆరోగ్యశ్రీ ద్వారా అందించే సేవల పరిమితి గతంలో 2 లక్షలు మాత్రమే ఉండేది. ఇప్పుడా పరిమితిని తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలకు పెంచింది. ప్రత్యేకంగా హార్ట్, లివర్, బోన్‌మారో వంటి అవయవ మార్పిడి చికిత్సల కోసం ఆరోగ్య శ్రీ ద్వారా పది లక్షల వరకు ఇవ్వనున్నది. దీనివల్ల రాష్ట్రంలోని పేదలకు ఎంతో మేలు చేకూరుతుంది. ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. దీంతో పాటు రాష్ట్రంలో వైద్య సేవలను మరింత విస్తరించాలని టీమ్స్మల్టీ సూపర్స్పెషాలిటీలను గచ్చిబౌలి, ఎల్బీనగర్, అల్వాల్, ఎర్రగడ్డలలో ఏర్పాటు చేయనుంది. ప్రతి హాస్పిటల్‌లో వెయ్యి పడకల చొప్పున నాలుగు వేల పడకలతో నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ఏర్పాటు చేయబోతున్నారు.
అదే విధంగా నిమ్స్ హాస్పిటల్ లో మరో రెండు వేల పడకలను ప్రభుత్వం పెంచబోతున్నది. దీంతో నిమ్స్ లో మొత్తం 3489 పడకలు అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు వరంగల్ హెల్త్‌సిటీలో 24 అంతస్తులతో మల్టీసూపర్ స్పెషాలిటీలను నిర్మించనున్నారు. ఈ మేరకు సుమారు 11 వందల కోట్లను ఖర్చు చేయనున్నారు. అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా 22 ఎంసీహెచ్హాస్పిటల్స్ ను రూ.407 కోట్లతో యునిసెఫ్ సూచించిన ప్రమాణాల ప్రకారం ఆధునీకరించనున్నారు.