Gautam Gambhir : భారత ఆటగాళ్లపై కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం!
టీం ఇండియా ఆటగాళ్లపై కోచ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు బుధవారం వెల్లడించాయి.
దిశ, స్పోర్ట్స్ : టీం ఇండియా ఆటగాళ్లపై కోచ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు బుధవారం వెల్లడించాయి. మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఘోర పరాజయం అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ మేరకు సంభాషణ సాగినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెల్లడించింది. ‘6 నెలలుగా మీకు నచ్చినట్లుగా ఆడారు. ఇక నుంచి ఇదంతా ఆపండి. జట్టు వ్యూహాలకు అనుగుణంగా ఆడని ఆటగాళ్లపై వేటు వేస్తాం.’ అని గంభీర్ అన్నట్లు సమాచారం. గంభీర్ వ్యూహాలు.. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శనతో ప్రస్తుతం జట్టులో వివాదం రాజుకున్నట్లు తెలుస్తోంది. మెల్‌బోర్న్ టెస్ట్‌లో పంత్ అనవసర షాట్ ఆడి ఔట్ కావడం మ్యాచ్ గతిని తిప్పేసిన విషయం తెలిసిందే. రోహిత్, కోహ్లీ సైతం ఈ సిరీస్‌లో వరుసగా భారీ స్కోర్లు చేయడంలో విఫలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్ హద్దు దాటే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది.
డ్రెస్సింగ్ రూమ్ విషయాలు లీక్.. సీనియర్లు సీరియస్
మరోవైపు టీం ఇండియా డ్రెస్సింగ్ రూంలో సంభాషణ వివరాలు బయటకు రావడం పట్ల భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, శ్రీవస్త్ గోస్వామి సీరియస్ అయ్యారు. డ్రెస్సింగ్ రూమ్ సంభాషణలు అత్యంత గోప్యంగా ఉండాలని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలు ఇంతటితో ఆగవని గోస్వామి అన్నారు.