బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందే గుర్తించే 'ఇమ్యునోసెన్సార్'

దిశ, ఫీచర్స్ : మహిళలు తమ ఆరోగ్య విషయంలో తరచూ నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఈ ధోరణే అనేక రోగాలకు హేతువుగా మారుతోంది..Latest Telugu News

Update: 2022-06-19 08:40 GMT

దిశ, ఫీచర్స్ : మహిళలు తమ ఆరోగ్య విషయంలో తరచూ నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఈ ధోరణే అనేక రోగాలకు హేతువుగా మారుతోంది. ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్‌కు కారణమవుతోంది. మహిళల్లో బయటపడుతున్న క్యాన్సర్లలో 27 శాతం ఇవే కాగా.. ఇండియాలోని పట్టణ ప్రాంతాల్లో ప్రతీ 28 మంది స్త్రీలలో ఒకరు, గ్రామీణంగా ప్రతీ 60 మందిలో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారినపడుతున్నారు. ఒక్క 2020లోనే ప్రపంచవ్యాప్తంగా 2.2 మిలియన్ రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో సంభవిస్తున్న క్యాన్సర్ మరణాల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌దే అగ్రభాగం. అయితే దీన్ని ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స అందించడం సులభం. ఇందుకు పరిష్కారంగానే ఏఎమ్‌పీఆర్‌ఐ శాస్త్రవేత్తలు 'ఎలక్ట్రోకెమికల్ ఇమ్యునోసెన్సార్‌'ను అభివృద్ధి చేశారు.

రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించేందుకు అనేక ఇన్వాసివ్, నాన్-ఇన్వాసివ్ మార్గాలు ఉన్నాయి. కానీ వాటికి అనేక పరిమితులున్నాయి. ఉదాహరణకు : ఇవి కొన్నిసార్లు తక్కువ-నాణ్యతా చిత్రాలను ప్రదర్శిస్తాయి. నొప్పితో కూడుకున్నవే కాక ఖరీదైనవి కూడా. పైగా ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు భోపాల్‌లోని CSIR-అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(AMPRI) పరిశోధకులు 'రొమ్ము క్యాన్సర్ బయోమార్కర్ CD44 యాంటిజెన్‌'ను గుర్తించేందుకు అత్యంత సున్నితమైన ఎలక్ట్రోకెమికల్ ఇమ్యునోసెన్సార్‌ను అభివృద్ధి చేశారు.

రొమ్ము క్యాన్సర్, ఇతర రకాల ట్యూమర్స్‌కు ముడిపడి ఉన్న ప్రధాన అణువుల్లో CD44 ఒకటిగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల, రొమ్ము క్యాన్సర్ అభివృద్ధిని చాలా ప్రారంభ దశలో అన్వేషించేందుకు దాని గుర్తింపు కీలకమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మేరకు CD44 యాంటిజెన్‌ను గుర్తించేందుకు గ్లాసీ కార్బన్ ఎలక్ట్రోడ్‌పై GO-IL-AuNPలను ఉపయోగించి నిర్మించిన ఎలక్ట్రోకెమికల్ ఇమ్యునోసెన్సార్‌ను పరిశోధకులు సంశ్లేషణ చేశారు.

యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ, FTIR స్పెక్ట్రోస్కోపీ, రామన్ స్పెక్ట్రోస్కోపీ, ఎక్స్-రే డిఫ్రాక్షన్ (XRD), ఫీల్డ్-ఎమిషన్ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ సహా ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీని ఉపయోగించి సంశ్లేషణ చేయబడిన సూక్ష్మ పదార్ధాల నిర్మాణ, క్రియాత్మక సామర్థ్యాలను ధృవీకరించేందుకు వివిధ పద్ధతులను ఉపయోగించారు. ఈ ప్రక్రియ CD44 బయోమార్కర్లకు వ్యతిరేకంగా ఎలక్ట్రోకెమికల్ డిటెక్షన్ పనితీరును అద్భుతంగా చూపించింది. అంతేకాకుండా, అభివృద్ధి చెందిన ఇమ్యునోసెన్సార్ విస్తృత గుర్తింపు పరిధిని కలిగి ఉందని, అలాగే ఇతర వాటితో పోలిస్తే గుర్తించే పరిమితి చాలా తక్కువగా ఉందని హైలైట్ చేసింది.


Similar News