క్రూయిజ్ షిప్‌లో రూ. 10 కోట్లతో అపార్ట్‌మెంట్ కొన్న జంట! ఇదే రీజన్..?!
వారి జీవితం కల కంటే అద్భుతంగా ఉండాలని అనుకున్నారు. Couple Buys Rs10 Cr. Apartment On Cruise Ship for their Daughters.
దిశ, వెబ్‌డెస్క్ః కొందరు తల్లిదండ్రులు తామ కలల్ని తమ బిడ్డల ద్వారా తీర్చుకుంటారని అంటారు. అయితే, వీళ్లు మాత్రం తమ బిడ్డల కోసమే కలగన్నారు. వారి జీవితం కల కంటే అద్భుతంగా ఉండాలని అనుకున్నారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు చెందిన దంపతులు అవాక్కయ్యే నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ కుమార్తెలు ప్రపంచాన్ని చూడాలనే ఉద్దేశంతో ఖరీదైన క్రూయిజ్ షిప్‌లో అపార్ట్‌మెంట్ కొన్నారు. దాని కోసం 1 మిలియన్ పౌండ్లు (రూ. 10 కోట్లు) వెచ్చించారు. మార్క్, బెత్ హంటర్ అనే దంపతులు తమ ఇద్దరు కుమార్తెలను ఒక చిన్న పడవలో ప్రపంచమంతా తిప్పాలని కలలు కనేవారు. అయితే, చివరకు ఒక పెద్ద షిప్పునే సెలక్ట్ చేశారు. ఇంకా ప్రారంభించని స్టోరీలైన్స్ నేరేటివ్ షిప్‌లో అపార్ట్‌మెంట్‌ను కొనడానికి సిద్దపడ్డారు.
ఈ షిప్ ఎలా ఉండబోతుందో కంపెనీ రూపొందించిన ప్రజెంటేషన్ చూసి డబ్బులు కట్టారు. స్పా, మైక్రోబ్రూవరీ, క్లినిక్, లైబ్రరీ వంటి ఎన్నో సౌకర్యాలతో ఉన్నఈ మెగా-షిప్‌లో డబుల్ బెడ్‌రూం, డబుల్ బాత్‌రూమ్‌ల అపార్ట్మెంట్లు అమ్ముతున్నారు. ఈ ఏడాది చివర్లో క్రొయేషియాలో మొత్తం 547 రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లతో భారీ నౌకను నిర్మించనున్నారు. ఇది 2024లో సముద్రంలో ప్రయాణించనుంది. ఇక ఈ ఓడ బయలుదేరే సమయానికి వీళ్ల కుమార్తెలకు 14, 16 ఏళ్లు వస్తాయి. ఈ ఓడ ప్రతి 1,000 రోజులకు భూగోళాన్ని చుట్టుముట్టి వస్తుందని కంపెనీ వెల్లడించింది. అలాగే, ఆగిన ప్రతి ఓడరేవు వద్ద చాలా రాత్రులు ఉంటుందని కూడా పేర్కొంది.
ఇక, ఇందులోని నివాసితులు జెట్ స్కిస్ లేదా కాయక్‌లపై సముద్రం నుంచి బయటకెళ్లొచ్చని తెలిపింది. ఇందులో 20 డైనింగ్, బార్ వేదికలు, మూడు పూల్స్, ఒక ఆర్ట్ స్టూడియో, బౌలింగ్ అల్లే, పెంపుడు జంతువుల వ్యాయామ ప్రాంతం ఉంటుందని చెప్పారు. ఫిట్‌నెస్ అభిమానుల కోసం, రన్నింగ్ ట్రాక్, జిమ్, యోగా స్టూడియో, గోల్ఫ్ సిమ్యులేటర్‌లు, పికిల్‌బాల్ కోర్ట్ ఉంటాయని కంపెని తెలిపింది.