అంబేద్కర్ జయంతిని వారికి వ్యతిరేకంగా జరుపుకోవాలి: మావోయిస్టు పార్టీ

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీ ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని ఘనంగా- Latest Telugu News

Update: 2022-04-10 16:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీ ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని ఘనంగా జరపవలసిందిగా ఇచ్చిన ప్రకటనలో కుట్ర దాగివుందని, ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వ శక్తులకు వ్యతిరేక సంకల్పంతో జయంతిని జరుపుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆదివారం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వ సంస్థలు నాటి నుంచి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వ్యతిరేకించాయని పేర్కొన్నారు. గత 8ఏళ్లుగా భారతదేశాన్ని ఫాసిస్టు పద్ధతిలో మెట్టు మెట్టుగా నిర్మిస్తుందని, దానికి ప్రజాకర్షణగా 'న్యూ ఇండియా' పేరు ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం దళిత, ఆదివాసీ, ముస్లిం, మహిళా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని.. రైతాంగ, కార్మిక, మధ్య తరగతి వర్గాలకు వ్యతిరేకంగా విధానాలను తీవ్రతరం చేసిందని అన్నారు.

ఒక పక్క ట్రిపుల్ తలాక్ చట్టం, 370, 35ఏ అధికరణాలను రద్దు, అయోధ్యలో రామమందిరం ఏర్పాటు చేశారన్నారు. దళిత ఆదివాసీ ప్రజల రాజ్యాంగబద్ధ హక్కులను ఉల్లంఘిస్తున్నారని, ఇలా అనేక చట్టాలను తీసుకు వచ్చేందుకు విఫలయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రిజర్వేషన్‌లను నిలిపివేయాలని చూస్తున్నారని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తీవ్రంగా ఉల్లంగిస్తున్నారని అన్నారు. గోరక్షణ పేరుతో మూక హత్యలు చేస్తున్నారని, దళిత, ఆదివాసీ ప్రజల ఆహార అలవాట్లు, జీవనం, ఆచార సంప్రదాలను నిషేదిస్తున్నారని, వారిని అవమానపరుస్తున్నారని అన్నారు. మను ధర్మాన్ని అంబేద్కర్ వ్యతిరేకించారని, కేంద్రం మళ్లీ అలాంటి పాలనను చేస్తుండడం వల్ల ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందూ శక్తులను వ్యతిరేకించాలన్నారు.

Tags:    

Similar News