Airtel| IndusInd Bank: ఇండస్ఇండ్ బ్యాంకుతో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ భాగస్వామ్యం!
న్యూఢిల్లీ: వినియోగదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) సౌకర్యాలను అందించేందుకు ఇండస్ఇండ్ బ్యాంకుతో ..Latest Telugu News
Airtel payment bank partners with indusind bank
న్యూఢిల్లీ: వినియోగదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) సౌకర్యాలను అందించేందుకు ఇండస్ఇండ్ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ మంగళవారం ప్రకటించింది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో కస్టమర్లు ఎలాంటి ఇబ్బందుల్లేని డిజిటల్ సేవల ద్వారా నిమిషాల వ్యవధిలో రూ. 500 నుంచి రూ. 1,90,000 వరకు ఎఫ్‌డీలను బుక్ చేసుకోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇండస్ఇండ్ బ్యాంకుతో భాగస్వామ్యం ద్వారా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు ఏడాదికి 6.5 శాతం వడ్డీ రేట్లను పొందగలరని, సీనియర్ సిటిజన్‌లు తమ అన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అదనంగా మరో 0.5 శాతం వడ్డీ పొందడానికి వీలవుతుందని కంపెనీ వివరించింది.
వినియోగదారులు 1,2,3 ఏళ్ల నిర్ణీత కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలలో పొదుపు చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా మెచ్యూరిటీ తేదీ కంటే ముందే ఎఫ్‌డీని రద్దు చేసుకునే వెసులుబాటు కూడా అందిస్తున్నామని, ప్రీ-మెచ్యూర్ విత్‌డ్రాలపై ఎలాంటి పెనాల్టీ, ప్రాసెసింగ్ ఫీజు కానీ వసూలు చేయమని కంపెనీ తెలిపింది. అలాగే, ఎఫ్‌డీలలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని కేవలం నిమిషాల వ్యవధిలోనే, అనుసంధానం చేసిన తమ బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతుందని పేర్కొంది. వినియోగదారుల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఎఫ్‌డీ సౌకర్యాలను ప్రారంభించాం. సురక్షితమైన, రిస్క్ తక్కువగా కలిగిన పెట్టుబడి ఎంపిక కోసం ఎఫ్‌డీ ఎంతో మెరుగైనది. దీనికోసం ఇండస్ఇండ్ బ్యాంకుతో భాగస్వామ్యం కావడంతో సంతోషంగా ఉందని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఆపరేటీంగ్ ఆఫీసర్ గణేష్ అనంతనారాయణన్ అన్నారు.