దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్, తన హై-స్పీడ్ గ్లోబల్ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇంటర్నెట్ కేబుళ్ల కన్సార్టియం 'సీ-మీ-వియ్-6లో చేరినట్టు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత్‌లో అత్యంత వేగంగా పెరుగుతున్న డిజిటల్ ఆర్థికవ్యవస్థకు అవసరమైన నెట్‌వర్క్ అందించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఫ్రాన్స్ నుంచి సింగపూర్ వరకు పలు దేశాలను కలిపే సముద్రగర్భ కేబుల్ నెట్‌వర్క్‌నే సీ-మీ-వియ్6 అంటారు. ఈ ప్రాజెక్ట్ 19,200 రూట్ కిలోమీటర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర గర్భంలోని కేబుల్ వ్యవస్థగా ఉందని ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ భారీ ప్రాజెక్టులో ప్రధాన పెట్టుబడిదారుగా పాల్గొంటామని, కేబుల్ వ్యవస్థకు కావాల్సిన మొత్తంలో 20 శాతం పెట్టుబడులను సమకూరుస్తామని ఎయిర్‌టెల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
2025 నాటికి సీ-మీ-వియ్6 కేబుల్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఎయిర్‌టెల్ బిజినెస్ డైరెక్టర్, సీఈఓ అజయ్ చిట్కారా.. డేటా సెంటర్లతో పాటు సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ 5జీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మద్దతుకు కీలకమైన మౌలిక సదుపాయాలుగా ఉంటాయి. ఈ విషయంలో ఎయిర్‌టెల్ ముందంజలో ఉంది. ఇప్పటికే అతిపెద్ద డేటా సెంటర్ నెట్‌వర్క్‌తో పాటు భారత్ వెలుపల అతిపెద్ద సముద్రగర్భ కేబుల్ నెట్‌వర్క్ నిర్వహిస్తోంది. సీ-మీ-వియ్6లో పెట్టుబడితో మరింత సామర్థ్యాన్ని కలిగి ఉంటామని' చెప్పారు. ఈ ప్రాజెక్టు కన్సార్టియంలో బంగ్లాదేశ్ సబ్‌మెరైన్ కేబుల్ కంపెనీ, ధీరాగు(మాల్దీవులు), జిబౌటీ టెలికాం, మొబిలీ(సౌదీ), ఆరెంజ్(ఫ్రాన్స్), సింగ్‌టెల్(సింగపూర్), శ్రీలంక టెలికాం, టెలికాం ఈజిప్టు, టెలికాం మలేషియా, టెలిన్(ఇండోనేషియా) సభ్యులుగా ఉన్నాయి. ఎన్ఎక్స్‌ట్రా పేరుతో డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ఎయిర్‌టెల్ కంపెనీకి ఇప్పటికే సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ ఉంది. ఇందులో 50 దేశాలకు 3,65,000 రూట్ కిలోమీటర్ల గ్లోబల్ నెట్‌వర్క్ సేవలు అందిస్తున్నట్టు వెల్లడించింది.