ఈవీ రంగంలోకి ప్రవేశించిన అదానీ కంపెనీ!

అహ్మదాబాద్: ప్రముఖ అదానీ గ్రూప్, ఫ్రెంచ్ ఎనర్జీ దిగ్గజం టోటల్ ఎనర్జీస్..telugu latest news

Update: 2022-03-27 11:55 GMT

అహ్మదాబాద్: ప్రముఖ అదానీ గ్రూప్, ఫ్రెంచ్ ఎనర్జీ దిగ్గజం టోటల్ ఎనర్జీస్ ఎస్ఈ జాయింట్ వెంచర్ అయిన అదానీ టోటల్ గ్యాస్ కంపెనీ ఎలక్ట్రిక్ మొబిలిటీ మౌలిక సదుపాయాల రంగంలోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా మొదటి ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) ఛార్జింగ్ స్టేషన్‌ను అహ్మదాబాద్‌లో ప్రారంభించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుతో అత్యుత్తమ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, మెరుగైన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈవీ వినియోగదారులకు సేవలందించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం అదానీ టోటల్ గ్యాస్ కంపెనీ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ సీఎన్‌జీ, పైప్‌డ్ గ్యాస్ పంపిణీదారుగా ఉంది.

మొదటి ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఈవీ వ్యాపారంలో ప్రవేశించడం కంపెనీకి కీలక మైలురాయిగా నిలిచింది. దీని ద్వారా భారత్‌లోని వినియోగదారులకు కొత్త గ్రీన్ ఫ్యూయెల్ అందించడం సంతోషంగా ఉంది. భారత్‌లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో మెరుగైన ఈవీ ఛార్జింగ్ అందుబాటులోకి రానున్నాయని ' అదానీ టోటల్ గ్యాస్ సీఈఓ సురేష్ పి మంగ్లానీ అన్నారు. దేశవ్యాప్తంగా 1,500 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి ప్రవేశించేందుకు, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీ మార్కెట్లో గణనీయమైన వాటాను కైవసం చేసుకునేందుకు దోహదపడుతుందని కంపెనీ వివరించింది.

Tags:    

Similar News