చల్పాక ఎన్కౌంటర్ పై నిజనిర్దారణ కమిటీ వెయ్యాలి.. పౌరహక్కుల సంఘం నేతలు..

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పాక అడవుల్లో పూలకొమ్మ వాగు సమీపంలో డిసెంబర్ 1న పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Update: 2024-12-23 07:38 GMT

దిశ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పాక అడవుల్లో పూలకొమ్మ వాగు సమీపంలో డిసెంబర్ 1న పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎన్కౌంటర్ ప్రదేశాన్ని ఆదివారం సుప్రీం కోర్టు అనుమతితో పౌరహక్కుల సంఘాల నాయకులు పరిశీలించారు. సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పౌర హక్కుల సంఘం నాయకులు డిసెంబర్ 1న జరిగిన ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ గా నిర్ధారించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టు తినే అన్నంలో విషం కలిపి మత్తులో ఉండగా పట్టుకుని చిత్రహింసలు చేసి కాల్చి చంపారని తెలిపారు. డిసెంబర్ 1న కాకుండా అంతకుముందే చంపి ఆ ప్రదేశంలో పడేశారన్నారు. అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఎన్ కౌంటర్ హత్యాకాండలు చోటు చేసుకోరాదని 2017 లో శృతి, సాగర్ ఎన్కౌంటర్ ల సమయంలో కేసీఆర్ ని కోరగా కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూ ఎన్ కౌంటర్ లు ఉండవన్నారన్నారు.

మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ పాలనలో బూటకపు ఎన్ కౌంటర్ లతో ఇప్పటికే 16 మందిని హతమార్చారని, హక్కుల పునరుద్దరణ పేరుతో, ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాశవిక పాలన కొనసాగిస్తుందని అన్నారు. ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల వెపన్స్ లాక్ లో ఉన్నాయా ఆన్ లాక్ లో ఉన్నాయా అనేది ఆయుధ నిపుణులతో పరిశీలించాలి అని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక జిరిగిన 16 ఎన్కౌంటర్ ల పై సిట్టింగ్ జడ్జీలతో విచారణ జరపాలన్నారు. ఎన్ కౌంటర్ పై నిజనిర్దారణ కమిటీ వేయాలని సుప్రీంకోర్టును కోరుతామని, చల్పాక ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై హత్యా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా చల్పాకలో జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశ పరిశీలనకు వెళ్లిన పౌర హక్కుల సంఘం నాయకులకు వ్యతిరేకంగా ఏటూరునాగారం మండలం ఐటీడీఏ క్రాస్ రోడ్డు వద్ద ప్రధాన రహదారి పై గిరిజనులు ధర్నా నిర్వహించారు. పౌరహక్కుల సంఘాలకు, మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీలు రోడ్డు పై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించి మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


Similar News