200 బిలియన్ డాలర్లు దాటిన మూడో భారతీయ సంస్థగా అదానీ గ్రూప్!

ముంబై: దేశీయ అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ ..telugu latest news

Update: 2022-04-07 16:54 GMT

ముంబై: దేశీయ అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో 200 బిలియన్ డాలర్ల(రూ. 15.19 లక్షల కోట్ల)ను అధిగమించిన మూడో గ్రూప్ సంస్థగా నిలిచింది. ఇప్పటివరకు ఈ ఘనతను రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ సంస్థలు సాధించాయి. అదానీ గ్రూప్ సంస్థ మొత్తం ఏడు లిస్టెడ్ కంపెనీలను కలిగి ఉంది. వీటిలో ఐదు కంపెనీల షేర్లు గురువారం నాటి ట్రేడింగ్‌లో ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరాయి. దీంతో గ్రూప్ మార్కెట్ క్యాప్ 200 బిలియన్ డాలర్లను దాటింది. ఇప్పటివరకు 320 బిలియన్ డాలర్ల(రూ. 24.30 లక్షల కోట్ల)తో టాటా గ్రూప్ అగ్రస్థానంలో ఉండగా, ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 237 బిలియన్ డాలర్ల(రూ. 18 లక్షల కోట్ల)తో రెండో స్థానంలో ఉంది.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు అదానీ గ్రూపునకు చెందిన అదానీ పవర్ లిమిటెడ్ 157 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 50 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 67 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ 51 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 17 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 28 శాతం వృద్ధి సాధించాయి. అదానీ విల్మర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో లిస్ట్ అయినప్పటి నుంచి 180 శాతం పెరిగింది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం.. గురువారానికి అదానీ గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ 201 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతేకాకుండా, తాజాగా బ్లూమ్‌బర్గ్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 109 బిలియన్ డాలర్ల(రూ. 8.2 లక్షల కోట్ల)తో ప్రపంచంలోనే ఎనిమిదో అత్యంత సంపన్నుడిగా నిలిచారు.

Tags:    

Similar News