పార్క్ క‌బ్జాదారుల‌పై చ‌ర్యలు తీసుకోవాలి: బీజేపీ నేత‌ల డిమాండ్

Update: 2022-02-17 16:37 GMT

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: స‌రూర్‌న‌గ‌ర్ మండ‌ల ప‌రిధిలోని లింగోజిగూడ సౌభాగ్యనగర్ కాల‌నీలో పార్క్ స్థలాన్ని, రోడ్డను క‌బ్జా చేసిన వారిపై చ‌ట్టపరమైన చ‌ర్యలు తీసుకోవాల‌ని బీజేపీ నేత‌లు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు గురువారం బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయ‌కులు జీహెచ్ఎంసీ జోన‌ల్ క‌మిష‌న‌ర్ పంక‌జ‌ను క‌లిసి విన‌తి ప‌త్రిం అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ.. అవేర్ స్వచ్ఛంద సంస్థ ఆధీనంలో ఉన్న లేఔట్ యొక్క పార్క్ స్థలాన్ని, రోడ్లను ఆక్రమించి కొత్త లేఔట్ చేసి క‌బ్జా చేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌభాగ్య న‌గ‌ర్ కాల‌నీకి చెందిన లేఔట్ ప్రకారం ప్రజల ఉప‌యోగార్థం ఆ స్థలాన్ని జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకుని పార్క్‌ను అభివృద్ది చేయాల‌ని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అనేక ప్రభుత్వ భూముల క‌బ్జాల‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యే అనుచ‌రులు, బినామీలు పార్క్‌ల‌ను, రోడ్లలను ఆక్రమిస్తున్నా.. జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు చ‌ర్యలు తీసుకోవ‌డం లేద‌ని ప్రశ్నించారు. లౌఔట్ ప్రకారం 20 మీట‌ర్ల 66 ఫీట్ల ప్రధాన ర‌హ‌దారిని ఆక్రమించి షెట్టర్‌లను నిర్మిస్తున్నార‌ని తెలిపారు. వ‌ర‌ద కాలువ కూడా దారికి ఆనుకొని ఉండ‌డం వ‌ల్ల వ‌ర‌ద ఉదృతి ఎక్కవైనప్పుడు ప్రజలు అనేక ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌న్నారు.

వెంట‌నే జీహెచ్ఎంసీ అధికారులు క‌బ్జాదారుల‌పై చ‌ట్టపరమైన చ‌ర్యలు తీసుకొని పార్క్ స్థలాన్ని, రోడ్ల ఆక్రమణలను కాపాడి ప్రజా అవ‌స‌రాల కోసం ఉప‌యోగించాల‌ని డిమాండ్ చేశారు. లేని ప‌క్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాడుతామ‌ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట‌ర్లు వంగ మ‌ధుసూద‌న్‌ రెడ్డి, ప్రేమ్, సురేంద‌ర్‌ యాద‌వ్‌, సుజాత‌ నాయ‌క్‌, ప‌వ‌న్‌ కుమార్‌, సౌభాగ్యనగర్ కాల‌నీ అధ్యక్షులు ప్రభాకర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News