Telangana News: సంచలనంగా మారిన ఫారెస్ట్ అధికారుల వరుస సస్పెన్షన్..

దిశ, పాలేరు: కూసుమంచి అటవీ శాఖ - A series of suspensions by forest officials has become a sensation

Update: 2022-04-12 11:40 GMT

దిశ, పాలేరు: కూసుమంచి అటవీ శాఖ అధికారుల వరుస సస్పెన్షన్లు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారాయి. మంగళవారం కూసుమంచి రేంజ్ అధికారి జ్యోత్స్నదేవిని లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదుల నేపథ్యంలో సస్పెన్షన్ చేస్తూ.. రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ రాకేష్ మోహన్ డోబ్రియల్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. అలాగే గత మూడు రోజుల క్రితం నేలకొండపల్లి బీట్ అధికారి, సెక్షన్ అధికారి సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. వీరు ఓ మహిళా గుత్తేదారు నుంచి లంచం తీసుకున్నారనే ఆరోపణలతో వీరిపై ఫిర్యాదు అందడంతో ఉన్నతాధికారులు విచారణ అనంతరం సస్పెన్షన్స్ చేపట్టారు. మరికొంత మంది పై విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

వీరు కోదాడ-ఖమ్మం వెళ్లే జాతీయ రహదారిపై కూసుమంచి అటవీ రేంజ్ పరిధిలోని నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో మొత్తం 324 చెట్ల నరికివేతకు సంబంధించి జిల్లాకు చెందిన బానోత్ ప్రమీల అనే గుత్తేదారు కాంట్రాక్టును దక్కించుకుంది. అయితే నరికివేత, తరలింపు అనుమతులు విషయంలో ఎఫ్ఆర్ఓ జ్యోత్స్న దేవి గుత్తేదారు ప్రమీలను డబ్బులు డిమాండ్ చేశారని ప్రమీల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు అడిగారని అక్కడితో ఆగకుండా ప్రతి లోడుకు కొంత నగదు ముట్టజెప్పాల్సిందిగా హుకుం జారీ చేసినట్లు గుత్తేదారు చీఫ్ కన్జర్వేటర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే రూరల్ మండలం తల్లంపాడు వద్ద సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై రెండు చెట్లును నరకాల్సిందిగా అధికారులు ప్రమీలను సంప్రదించారు.

దీంతో ప్రమీల తన కూలీలను పంపగా ఫారెస్ట్ అధికారులు అక్కడ కూడా డబ్బు డిమాండ్ చేసి కులం పేరుతో దూషించిందని 25న ఫిబ్రవరిన ప్రమీల ఫిర్యాదులో పేర్కొన్నారు. గుత్తేదారు 2021 ఆగస్టు 21న అనుమతులు పొందారు. తల్లంపాడు ఘటనతో ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారులు మార్చి 5న విచారణ ప్రారంభించి నిర్ధారణ అనంతరం ఒక్కొక్కరిపై సస్పెన్షన్ వేస్తూ వస్తున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు విచారణ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ వ్యవహారంలో మరికొంత మంది క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్‌కి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. వరుసగా ఫారెస్ట్ అధికారులు సస్పెన్షన్‌కి గురికావడంతో ప్రస్తుతం ఈ టాపిక్ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Tags:    

Similar News