సూర్యాపేటలో శిశు విక్రయాలు..? తెలివిగా తప్పించుకున్న బాలుడు..
దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలో మంగళవారం శిశు విక్రయం ఆలస్యం.. Latest Telugu News..
దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలో మంగళవారం శిశు విక్రయం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్ర రాష్ట్రం కృష్ణా జిల్లా తిరువూరు మండల కేంద్రానికి చెందిన బాణాల వరప్రసాద్‌కు ఇద్దరు కుమారులు. వారిలో చిన్నవాడు అనిల్ కుమార్ ఉట్నూరు హాస్టల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. పది రోజుల కిందట ఇంటి నుండి హాస్టల్‌కు వెళ్లేందుకు బాలుడు తిరువూరు బస్ స్టాండ్‌కి వెళ్లగా.. అది గమనించిన గుర్తు తెలియని వ్యక్తి అనిల్‌కు మాయమాటలు చెప్పి తనతో తీసుకెళ్లాడు.
అతను పెన్ పహాడ్ మండలం పరిధిలోని నాగులపాడు గ్రామంలో ఉన్న బాతుల పెంపకందారులకు ఐదు వేలకు విక్రయించాడు. పది రోజుల క్రితం బాలుని ఇక్కడికి తీసుకొచ్చి బాతుల సందర్శనకు వినియోగిస్తూ వెట్టి చాకిరీ చేయిస్తున్నాడు. సోమవారం రాత్రి గ్రామానికి చెందిన ఒక యువకుడు అటుగా వెళుతుండటం గమనించిన బాలుడు అతని వద్ద నుండి సెల్ ఫోన్ తీసుకొని తన తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం వివరించాడు. అప్రమత్తమైన బాలుని బంధువులు సదరు యువకునికి ఫోన్ చేసి ఏ ప్రాంతంలో ఉన్నారో వివరాలు సేకరించారు.
అనంతరం సమీపంలోని బంధువులకు సమాచారం అందించి.. సంబంధిత మండల పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాతుల పెంపకందారుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. శిశు విక్రయం నిజమే అని తేలింది. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఇంకా బాతుల పెంపకం దారుల వద్ద మరో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దానిపై విచారణ గుట్టుగా చేస్తున్నట్లు సమాచారం.