తెలంగాణకు భారీ పెట్టుబడులు.. ఫలించిన కేటీఆర్ అమెరికా పర్యటన
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పెట్టుబడికి చివరి రోజు నాలుగు కంపెనీలు ముందుకు..latest telugu news
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పెట్టుబడికి చివరి రోజు నాలుగు కంపెనీలు ముందుకు వచ్చాయి. సమారు 3402 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టేందుకు అంగీకారం తెలిపాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆర్.ఏ చెమ్ ఫార్మా లిమిటెడ్, అవ్రా ల్యాబొరేటరీస్ లో అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ రూ.1750 కోట్లు, న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న స్లేబ్యాక్ ఫార్మా సుమారు రూ.1500 కోట్లు, యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకోపియా రెండు లక్షల డాలర్ల (సుమారు రూ. 152కోట్లు)తో నిరంతర ఔషధ తయారీ (ఫ్లో కెమిస్ట్రీ) కేంద్రాన్ని ఏర్పాటుకు ముందుకొచ్చింది. అదే విధంగా క్యూరియా గ్లోబల్ హైదరాబాద్‌లో గ్లోబల్ షేర్డ్ సర్వీసెస్ సెంటర్ ఏర్పాటుతో 200 హై స్కిల్లిడ్ ఉద్యోగాలు లభించనున్నాయి.
హైదరాబాద్‌లోని లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ ముందుకు వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ న్యూయార్క్ లోని అడ్వెంట్ ఇంటర్నేషన్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ మేనేజింగ్ పార్టనర్ జాన్ మాల్డోనాడోతో సమావేశమయ్యారు. ఇండియాలోని ఇతర నగరాలతో పాటు హైదరాబాద్ లో అడ్వెంట్ కంపెనీ వ్యాపార వ్యూహాలు, విస్తరణ ప్రణాళికలపై ఈ మీటింగ్‌లో చర్చించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆర్.ఏ చెమ్ ఫార్మా లిమిటెడ్ , అవ్రా ల్యాబొరేటరీస్‌లో మెజార్టీ వాటాలు కొనేందుకు 1750 కోట్ల రూపాయాలు పెట్టుబడులు పెట్టాలన్న అడ్వెంట్ కంపెనీ నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించారు. ఈ రెండు కంపెనీలకు 6 తయారీ యూనిట్లు, 3 పరిశోధన (ఆర్ అండ్ డీ)యూనిట్లు ఉన్నాయి. 2500 మంది ఉద్యోగులు ఈ రెండు కంపెనీల్లో పని చేస్తున్నారు.
స్లేబ్యాక్ ఫార్మా ....
న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న స్లేబ్యాక్ ఫార్మా కంపెనీ హైదరాబాద్ ఫార్మా రంగంలో భారీ విస్తరణ ప్రణాళికలు స్లేబ్యాక్ ఫార్మా వ్యవస్థాపకులు, సీఈఓ అజయ్ సింగ్ ప్రకటించారు. రాబోయే మూడు సంవత్సరాల్లో సుమారు 1500 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. సీజీఎంపీ ల్యాబ్ తో పాటు అత్యాధునిక తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ లో ప్రారంభించబోతుంది. గడిచిన ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ ఫార్మాలో స్లేబ్యాక్ కంపెనీ సుమారు 2300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టామన్నారు. 35 మంది సిబ్బందితో 2017లో హైదరాబాద్ లో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించించామని, ప్రస్తుతం 3యూనిట్లు, 106 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లు తెలిపారు.
యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా...
లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఆ రంగంలోని దిగ్గజ కంపెనీలు ఆకర్షితమవుతున్నాయి. అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా చేరింది. రెండు లక్షల వేల డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో నిరంతర ఔషధ తయారీ (ఫ్లో కెమిస్ట్రీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మంత్రి కేటీఆర్ తో యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, ఇండియా ఆపరేషన్స్ హెడ్ స్టాన్ బుర్హాన్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రీజియన్స్, స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ డాక్టర్ కె.వి. సురేంద్ర నాథ్ ల సమావేశం తరువాత ఆ సంస్థ ఈ పెట్టుబడి ప్రకటన చేసింది. 12,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీనోమ్ వ్యాలీలో తాము ఏర్పాటుచేసే ఈ అత్యాధునిక ల్యాబ్‌కు సింథటిక్, విశ్లేషణాత్మక సామర్థ్యం ఉంటుందని కేటీఆర్‌కు వివరించారు.
క్యూరియా గ్లోబల్ షేర్డ్ సర్వీసెస్ సెంటర్...
న్యూయార్క్ కేంద్రంగా ఉన్న క్యూరియా గ్లోబల్ హైదరాబాద్ లోని తన కేంద్రంలో పనిచేసే ఉద్యోగులను రాబోయే 12 నెలల్లో రెట్టింపు చేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే మన దేశంలో ఈ కంపెనీ 27 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇతర క్యూరియా గ్రూప్ సంస్థలు, థర్డ్ పార్టీ సంస్థల కోసం ఔషధ రసాయన శాస్త్రంలో తయారీ, ఒప్పంద పరిశోధన కార్యకలాపాలను ఈ సంస్థ నిర్వహిస్తుంది. క్యూరియా గ్లోబర్ వనరులతో మన దేశంలోని ఆ సంస్థ కేంద్రాలు పనిచేస్తున్నాయి. క్యూరియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ప్రకాష్ పాండియన్ కంపెనీని విస్తరిస్తున్నట్లు తెలిపారు. రాబోయే 12 నెలల్లో 200 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సమావేశంలో పరిశ్రమలు , వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎంనాగప్పన్ పాల్గొన్నారు.
ముగిసిన కేటీఆర్ పర్యటన
ఈ నెల 19న కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. తెలంగాణలో పరిశ్రమలకు గల అనుకూలతలను వివరించి పెట్టుబడికి ఆహ్వానించారు. తిరిగి ఇండియాకు తిరుగు పయనమయ్యారు. సోమవారం హైదరాబాద్ కు చేరుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.