దిశ, ఫీచర్స్: అమెరికాలోని టెనస్సీలో నివసిస్తున్న 24 ఏళ్ల నికి హచిన్సన్ వృత్తిరిత్యా సోషల్ మీడియా ప్రొడ్యూసర్. ఆమె తల్లి ఇటీవలే చనిపోగా, వారసత్వంగా వచ్చిన ఇంటిని $300,000 (రూ. 2.23 కోట్లు)కు అమ్మేసింది. అయితే ఈ భారీ మొత్తాన్ని 'క్రిప్టో రొమాన్స్ స్కామ్' కారణంగా కోల్పోయింది. నికి హచిన్సన్‌కు హింగే డేటింగ్ యాప్‌లో 'హావో' అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను టెక్స్‌టైల్ బిజినెస్ చేస్తున్నట్లు చెప్పుకోగా.. ఇద్దరూ కొన్నాళ్లపాటు గంటల తరబడి చాట్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే తన ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బు విషయాన్ని హావోతో షేర్ చేసుకుంది నికి. ఇదే అదనుగా ఆ డబ్బును క్రిప్టోకరెన్సీలో పెట్టుబడిగా పెడితే అదనపు ఆదాయం సంపాదించవచ్చని, అది ఎలాగో నేర్పిస్తానంటూ అతడు నమ్మబలికాడు. దీంతో హావో ఇచ్చిన వాలెట్ చిరునామాకు ఆమె తొలిసారి కొద్ది మొత్తంలో డబ్బు పంపింది. అది 'ICAC' క్రిప్టో ఎక్స్‌చేంజ్‌లోని ఖాతాలో డిస్‌ప్లే కావడంతో ఆ తర్వాత మరిన్ని డబ్బులు పంపించింది. అతని సలహాతో ఇంత సులభంగా డబ్బు సంపాదించడం చూసి ఆశ్చర్యపోయింది. చివరకు క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో తన సేవింగ్స్ మొత్తం డంప్ చేయడమేకాక మరింత ఇన్వెస్ట్ చేసేందుకు రుణం కూడా తీసుకుంది.
రెడ్ ఫ్లాగ్స్..
అయితే 2021 డిసెంబర్‌లో నికి.. తన ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోలేకపోయింది. ICAC కస్టమర్ సర్వీస్ ఏజెంట్‌ను సంప్రదిస్తే.. పన్నులు చెల్లించనంత(వందల వేల డాలర్లు) వరకు ఖాతా ఫ్రీజింగ్‌లో ఉంటుందని తెలియజేయడంతో అవాక్కయింది. అదే సమయంలో హావో మెసేజ్ చేయడం కూడా ఆపేశాడు. ఇక వారి మునుపటి వీడియో చాట్‌లోనూ అతడు తన ముఖాన్ని పాక్షికంగానే చూపిస్తూ వెంటనే కాల్ కట్ చేసేవాడు. ఇవన్నీ బేరీజు వేసుకున్నాక తను మోసపోయినట్లు గ్రహించింది. ఇప్పుడు ఆ స్కామర్‌ను పట్టుకునేందుకు ఫ్లోరిడా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు నికి ఒక్కటే కాదు, దాదాపు 56,000 రొమాన్స్ స్కామ్స్ జరిగినట్లు ఏజెన్సీ డేటా నివేదించింది.