'మన ఊరు- మన బడి' కార్యక్రమానికి ఆ జిల్లాలో భారీగా పాఠశాలలు ఎంపిక!

Update: 2022-02-15 15:18 GMT

దిశ ప్రతినిధి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యార్థులకు అందించాలని సంకల్పించింది. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సకల సౌకర్యాలు అందించేందుకు గాను మన ఊరు - మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయడమే కాకుండా దాతల సాయాన్ని కోరుతుంది. దాతలు, ప్రభుత్వ నిధులతో మొదటి విడతలో 33 శాతం అనగా ఉమ్మడి జిల్లాలో 1,096 పాఠశాలలు ఎంపిక చేసింది. పాఠశాలలో చేపట్టాల్సిన మౌళిక సదుపాయాల సౌకర్యాల అంశాలపై జిల్లా ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.

1,096 పాఠశాలలు ఎంపిక..

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం జిల్లాలోని పాఠశాలల్లో 33 శాతం పాఠశాలలను మొదటి విడతగా అభివృద్ధి చేయనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 3,161 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మొదటి విడతగా 1,096 పాఠశాలలను ఎంపిక చేశారు.

జిల్లాల వారీగా చూసుకుంటే సిద్దిపేట జిల్లాలో 976 పాఠశాలలకు గాను 341 పాఠశాలలను ఎంపిక చేశారు. అదే విధంగా మెదక్ జిల్లాలో 923 పాఠశాలలకు గాను 13 పాఠశాలలు, సంగారెడ్డి జిల్లాలో 1,262 పాఠశాలలకు గాను 442 పాఠశాలలు ఎంపిక చేశారు. ఈ విద్యా సంవత్సరంలో పనులను మొదలు పెట్టి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సంసిద్ధం చేయనున్నారు. శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర విద్యా, ఆరోగ్య శాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావులు పాఠశాలల అభివృద్ధిలో స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు.

పాఠశాలలన్నింటికి ఒకటే రంగు..

మన ఊరు - మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నీటి సౌకర్యం తో టాయిలెట్ల నిర్మాణం, త్రాగు నీటి సౌకర్యం, విద్యార్థులకు సిబ్బందికి పూర్తిస్థాయిలో ఫర్నీచర్, పాఠశాలల్లో గ్రీన్ చాక్ బోర్డులను ఏర్పాటు, పాఠశాలల్లో ప్రహరి గోడల నిర్మాణం, అన్ని పాఠశాలలకు కిచన్ షెడ్ల నిర్మాణం, శిధిలమైన తరగతి గదుల స్థానంలో కొత్త అదనపు తరగతుల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్ల నిర్మాణం, డిజిటల్ విద్యా విధానం, పూర్తిస్థాయిలో పాఠశాలల మరమత్తులు, అన్ని పాఠశాలల్లో విద్యుద్దీకరణ, అన్ని పాఠశాలలకు ఒకేవిధమైన పెయింటింగ్ వేయించేలా చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశారు. పాఠశాలలోని గోడలపై విద్యార్థులను ఆకట్టుకునేలా బొమ్మలను గీయించి పాఠశాలలను అన్ని హంగులతో అభివృద్ధి చేసి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

కలెక్టర్ పర్యవేక్షణలో..

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని మండలం ఒక యూనిట్ గా తీసుకోని అన్ని ఇంజనీరింగ్ శాఖల అధికారులు ఒక్కొక్క మండలంలోని పాఠశాలల్లో అభివృద్ధి పనులను చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఇంజనీరింగ్ అధికారులు అవసరమైన పనులకు అంచనాలను సరిగా రూపొందించాలి. గ్రామాలలో పాఠశాలల అభివృద్ధికి విరాళాలు ఇచ్చే దాతలను గుర్తించి, విరాళాలను సేకరించి పాఠశాలల అభివృద్ధి పనులకు వినియోగించాలి.

దాతల సాయంతో అభివృద్ధి..

ప్రతి పాఠశాల నిర్వహణ కమిటీ రెండు చొప్పున బ్యాంకు ఖాతాలను తెరవాల్సి ఉంటుంది. ఒక ఖాతాలో ప్రభుత్వం ఇచ్చే డబ్బులను జమ చేయనున్నారు. మరొక ఖాతాలో ప్రజలు, పూర్వ విద్యార్థులు, విద్యాభిమానులు, తదితరులు ఇచ్చే విరాళాల సొమ్మును జమ చేయాలన్నారు. ఈ ఖాతాల వివరాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచి మరిన్ని విరాళాలను ప్రోత్సహించాలన్నారు. ఒక గది నిర్మాణానికి 10 లక్షల విరాళం ఇస్తే ఆ గదికి దాత పేరు పెట్టాలని, 25 లక్షలు ఇస్తే ఆ బ్లాకు దాత పేరు పెట్టాలని, కోటి రూపాయలు ఇస్తే మొత్తం పాఠశాలకే దాత పేరును పెట్టాలని సూచించింది. ఇవే కాకుండా నాబార్డు, ఉపాధి హామీ పథకం , ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక గ్రాంట్లను వినియోగించనున్నారు.

ప్రజాప్రతినిధులు సహకరించాలి.. మంత్రి హరీశ్ రావు

ఉమ్మడి మెదక్ జిల్లాలో మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని ఎంపిక చేసిన పాఠశాలల అభివృద్ధికి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలి. మనం చదువుకున్న పాఠశాలలకు సహాయం అందించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏయే అవసరాలు ఉన్నాయనే అంశాలపై సరైన ప్రణాళిక రచించి త్వరితగతిన వాటి నిర్మాణాలు చేపట్టాలి. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయం, దాతల సహకారంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని పాఠశాలలను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.

Tags:    

Similar News