ఇద్దరు హ్యూమన్ ట్రాఫికర్స్‌పై కేసు.. నేరస్థులపై పీడీ చట్టం
Rachakonda police detained two human trafickers
దిశ, జవహర్ నగర్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో వ్యవస్థీకృత మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్, వ్యభిచార నిర్వహణను రూపుమాపేందుకు, కుటుంబ వ్యవస్థలో, కళాశాలకు వెళ్లే విద్యార్థులు, యువత ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లో పడకుండా భద్రత కల్పించేందుకు అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం యువతే తమ టార్గెట్‌గా వ్యవహరిస్తున్నాయి. ఇదే విధంగా సి.పి. రాచకొండ కమిషనరేట్‌లోని జవహర్‌నగర్ పీఎస్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు హ్యూమన్ ట్రాఫికింగ్ నేరస్థులపై పీడీ యాక్ట్ ప్రయోగించి పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని చెర్లపల్లిలోని సెంట్రల్ జైలు, చెంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు.
ఈ మేరకు శనివారం రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరస్తులు వానరుల సాయి కిషోర్, వానరుల భవాని, ఇతర నాలుగు ట్రాఫికర్లతో కలిసి జవహర్‌నగర్ పీఎస్ పరిధిలోని శివాజీ నగర్‌లో వ్యభిచార గృహాన్ని నడుపుతున్నారు. జీవనోపాధి, మంచి ఆదాయ వనరులు కల్పిస్తామన్న ముసుగులో అమాయక యువతులను ప్రలోభపెట్టి వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు. వారు తమకు తెలిసిన పరిచయాల ద్వారా పురుష కస్టమర్‌లను సేకరించి, బాధిత మహిళలు, అమ్మాయిలను హైదరాబాద్‌లోని ఇతర ట్రాఫికర్‌లకు చెల్లింపుపై పంపుతారు. ఇలా త్వరితగతిన డబ్బు సంపాదిస్తూ వ్యభిచార వ్యాపారం ద్వారా వచ్చే సంపాదనతో జీవిస్తున్నారు.
దీంతో గత నెల 15న పక్కా సమాచారంతో, జవహర్‌నగర్ పోలీసులు శివాజీ నగర్‌లోని ఇంటిపై దాడి చేసి, మరో నలుగురు ట్రాఫికర్లతో పాటు ప్రతిపాదిత బాధితులను అరెస్టు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చిన ముగ్గురు బాధిత మహిళలను రక్షించి వారిని రెస్క్యూ హోమ్‌లో ఉంచారు. అరెస్టు చేసిన నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించి జైలుకు తరలించారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడకుండా, ప్రజా శాంతిభద్రతలను పరిరక్షించేందుకు, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ ఎం. భగవత్ ఇద్దరు అక్రమ రవాణాదారులపై పీడీ యాక్ట్ ప్రయోగించి చెర్లపల్లి కేంద్ర కారాగారం, చెంచల్‌గూడ మహిళా ప్రత్యేక జైల్లో ఉంచారు.