రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.. : నకిరేకల్ ఎమ్మెల్యే
పోరాడి సాధించిన తెలంగాణను 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం
దిశ,నకిరేకల్ : పోరాడి సాధించిన తెలంగాణను 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు. సంక్రాంతి లోపు అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసాను అందిస్తామని హామీ ఇచ్చారు. నకిరేకల్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో మంజూరైన 83 మందికి కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం మాట తప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్లపాటు తాకట్టుపెట్టి నిధులను దండు కున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం గ్యాస్ సబ్సిడీ కరెంట్ అందజేస్తున్నట్లు గుర్తు చేశారు.
గురుకుల పాఠశాలన్ని ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా 30 ఎకరాల్లో 200 కోట్లతో పాఠశాల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. విద్య వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్న విషయాన్ని వెల్లడించారు. రాబోయే రోజుల్లో నకిరేకల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా మార్చుతాను అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.