రెండు తలలు.. మూడు చేతులు.. ఒకే శరీరంతో కవలలు
దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా తలలు కలిసిపోయి పుట్టిన అవిభక్త కవలల గురించి..latest telugu news
దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా తలలు కలిసిపోయి పుట్టిన అవిభక్త కవలల గురించి తెలిసిందే. అలాగే అవయవాలు వేరుగా ఉన్నా, శరీరం అతుక్కుని జన్మించిన ట్విన్స్ స్టోరీలు కూడా వినే ఉంటారు. కానీ బుధవారం మధ్యప్రదేశ్, రత్లామ్‌కు చెందిన ఓ మహిళ.. రెండు తలలు, మూడు చేతులు గల బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శిశువు 'డైసెఫాలిక్ పారాపాగస్' అనే పరిస్థితితో బాధపడుతుండగా.. దీన్ని పాక్షిక కవలల(Partial twinning)కు అరుదైన రూపంగా డాక్టర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సపోర్ట్ సిస్టమ్‌పై ఉన్న చిన్నారి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు ఇండోర్‌లోని MY హాస్పిటల్ డాక్టర్ బ్రజేష్ లాహోటి వెల్లడించారు.
డైసెఫాలిక్ పారాపాగస్ లేదా పాక్షిక ట్విన్నింగ్ అంటే ఏమిటి?
'డైసెఫాలిక్ పారాపాగస్' అంటే ఒక మొండెం మీద రెండు తలలు పక్కపక్కనే ఉండేటువంటి పాక్షిక కవలల అరుదైన రూపం. ఈ విధంగా కలిసి ఉన్న శిశువులను కొన్నిసార్లు 'టూ హెడెడ్ బేబీస్'గా పిలుస్తారు. అయితే డైసెఫాలిక్ కవలలు పుట్టుకతోనే చనిపోతారు లేదా పుట్టిన వెంటనే చనిపోతారు. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే యుక్తవయస్సు వరకు జీవించి ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. 50,000 నుంచి 100,000 జననాల్లో ఒక్కరే ఈ విధంగా జన్మించే అవకాశం ఉండగా.. అంతుక్కుని పుట్టిన కవలల్లో డైసెఫాలిక్ ట్విన్స్ 11 శాతం ఉన్నారు. ఈ మేరకు కేసును బట్టి అవయవాల సంఖ్యలో మార్పు ఉంటుందని.. కొన్ని సందర్భాల్లో రెండు పూర్తి హృదయాలు కూడా ఉండవచ్చని మెడికల్ హిస్టరీ చెబుతోంది. ఇది వారి మనుగడ అవకాశాలను మెరుగుపరుస్తుంది.