అసెంబ్లీ సమావేశాల గడువు పెంచాలి.. వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల
సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఎన్నికల కుంభకర్ణుడు కేసీఆర్ కు అసెంబ్లీ అంటే భయం అని అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించే దమ్ము ఆయనకు లేదని, మూడొద్దులు అసెంబ్లీ పెట్టి ముగిస్తారని అన్నారు. అసెంబ్లీలో గత రెండు ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలపై చర్చ జరగాలని చెప్పారు. తన పాలనపై దమ్ముంటే ఈసారైనా అసెంబ్లీలో తన హామీలపై చర్చ పెట్టాలని సవాలు విసిరారు. అదే తమ పాలనకు రెఫరెండంగా నిరూపించుకోవాలని అన్నారు. నియంతలా పాలించడం, జనాలను దోచుకోవడం తప్ప కేసీఆర్ కు ఇంకేం చేతకాదని మండిపడ్డారు. కేసీఆర్ పార్టీ బందీపోట్ల రాష్ట్ర సమితి , తాలిబన్ల రాష్ట్ర సమితి అని ఆరోపించారు.
ఎన్నికలు ముందు బయటకు రావడం కాదని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలపై మాట్లాడాలని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి, ఉచిత ఎరువులు, కేజీ టు పీజీ ఉచిత విద్య, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లుఎందుకు ఇవ్వలేదో చెప్పాలని అన్నారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమిపై సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీలకు కేటాయిస్తామన్న రూ.50వేల కోట్లు నిధులపై చర్చించాలని, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్ నోరు తెరవాలని అన్నారు. అమరుల కుటుంబాలకు ఏం మేలు చేశారో అసెంబ్లీలో చెప్పాలని డిమాండ్ చేశారు.