దొర ప్రజలకు చిప్ప చేతిలో పెడుతుండు.. సీఎం కేసీఆర్ పై షర్మిల ఫైర్
రాష్ట్రం పేరిట "అప్పులు చేసి దొర పప్పు కూడు" తింటూ ప్రజలకు చిప్ప చేతిలో పెడుతున్నడని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రం పేరిట "అప్పులు చేసి దొర పప్పు కూడు" తింటూ ప్రజలకు చిప్ప చేతిలో పెడుతున్నడని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బంగారు తునకలాంటి ధనిక రాష్ట్రాన్ని.. తన ధన దాహానికి బలి చేసి.. అప్పు పుట్టనిదే, ఉన్న భూములు అమ్మనిదే రాష్ట్రం ముందుకు పోలేని దీనస్థితికి తెచ్చిండని విమర్శించారు. 5 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా రాష్ట్ర ఖజానాలో చిల్లిగవ్వ లేదన్నారు. స్కాములతో నిధులన్ని స్వాహా చేసి.. స్కీములను "కాం" చేశారన్నారు. ఇంతకాలం దోచుకుతిన్నది చాలక ఎన్నికలకు మూడు నెలల ముందు పథకాలకు అప్పులు కావాలని కేంద్రం వద్ద కొత్త డ్రామాకు తెర లేపుతున్నడని ఆరోపించారు.
మరో లక్ష కోట్ల అప్పులకు తంటాలు పడే కేసీఆర్.. రుణమాఫీ, 12 లక్షల మంది పక్కా ఇండ్లకు దరఖాస్తు పెట్టుకుంటే ఎందుకు కట్టలే? దళితులకు 3 ఎకరాల భూమి, ఫీజు రీయింబర్స్మెంట్, 20 వేల కోట్లతో ఉచిత ఎరువులు, 50 లక్షల మంది నిరుద్యోగులకు రూ.3016 నిరుద్యోగ భృతి, కాంట్రాక్టర్లకు 37 వేల కోట్ల బిల్లులు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. అభివృద్ధి కోసమే అప్పులు చేసే మీరు.. తెచ్చిన అప్పులన్నీ ఎక్కడ పెట్టారు ? అని ప్రశ్నించారు. అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడమేనా అభివృద్ధి? అని ప్రశ్నించారు. చేసిన అప్పులను సొంత ఖజానాకు మళ్లించి, రాష్ట్ర సంపదను విలాసాలకు వాడుకుంటూ ఒక్కో నెత్తిపై 2 లక్షల అప్పు పెట్టిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు.