రైతులను చూసైనా గుండె కరగడం లేదా కేసీఆర్ దొరా..? సీఎంపై షర్మిల ఫైర్
మిల్లర్లు, వ్యాపారులు క్వింటాలుకు 12 కిలోల ధాన్యం తరుగు తీసి, రైతుల పొట్టకొడుతున్నా మౌనం వీడవా? అంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో: మిల్లర్లు, వ్యాపారులు క్వింటాలుకు 12 కిలోల ధాన్యం తరుగు తీసి, రైతుల పొట్టకొడుతున్నా మౌనం వీడవా? అంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రిని నిలదీశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు. తడిసిన వడ్లు కొనాలని, కోతలు పెట్టవద్దని రైతులు కాళ్లావేళ్లా పడుతున్నారని, అయిన గుండె కరగడం లేదా కేసీఆర్ దొరా? అంటూ పేర్కొన్నారు. ఇదేనా కిసాన్ సర్కారు అంటే? అని ప్రశ్నించారు.
ఎండనకా, వాననకా రైతులు కొనుగోలు సెంటర్లలో పడిగాపులు కాస్తున్నారని, గడీల్లో దర్జాగా బతకడమా? పెద్ద రైతును అని చెప్పుకునే స్వయం ప్రకటిత మేధావికి రైతుల బాధలు నెత్తికెక్కడం లేదా? అని సీఎంను నిలదీశారు. అప్పుల పాలైన రైతన్నలు రోదిస్తున్నారని, వచ్చిన అరకొర దిగుబడిపైనా కోతలా? అని ప్రశ్నించారు. రైతుల విషయంలో ఎంతైనా చలించని కేసీఆర్ నికృష్ట పాలనకు నిరసనగా.. రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం వైఎస్ఆర్టీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ కేంద్రాల వద్ద ధర్నాలు చేయబోతున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.