పంచాయతీ‌రాజ్ చట్టంలో కీలక మార్పు.. ఇక కండిషన్ లేనట్లే..

త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తులు సైతం పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

Update: 2024-11-20 02:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తులు సైతం పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆ మేరకు ప్రస్తుతం ఉన్న పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్‌గా పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తులే అర్హులు. దీనితో చాలా మంది పోటీ చేసే అవకాశం కోల్పోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరికీ పోటీచేసే అవకాశం కల్పించాలని క్షేత్ర స్థాయిలో డిమాండ్ వస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత చట్టానికి సవరణ చేయాలని భావిస్తున్నట్టు సెక్రెటేరియట్ వర్గాల్లో టాక్ నడుస్తున్నది.

త్వరలోనే చట్ట సవరణ

ఇకపై ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు సైతం లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించనుంది. ప్రస్తుత చట్టంలో జూన్1, 1995 తర్వాత మూడో సంతనం ఉన్న వ్యక్తులు పోటీచేసేందుకు అనర్హులు. ఈ నిబంధనను తొలగించాలని చట్టం నుంచి సవరించేందుకు సీఎం సానుకూలంగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ముందుగా సమగ్ర కుటంబ రాజకీయ, ఆర్థిక సర్వే పూర్తయిన వెంటనే, బీసీ జనాభా లెక్కింపు, రిజర్వేషన్లను ఫైనల్ చేయనున్నారు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న పంచాయతీ, మున్సిపల్ చట్టాలను సవరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పంచాయతీ చట్టంలో సర్పంచులపై వేటు వేసే అధికారం కలెక్టర్లకు అప్పటి ప్రభుత్వం కట్టపెట్టింది. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చినా బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచులపై కలెక్టర్లు వేటు వేసే నిబంధనను తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.


Similar News