సర్కార్ మారడంతో దళితబంధు గుబులు.. గులాబీ లీడర్లలో టెన్షన్!
దళితబంధు ఇప్పిస్తామని చెప్పి దళితుల దగ్గర డబ్బులు వసూలు చేసిన కొందరు గులాబీ నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది.
దిశ, చర్ల: దళితబంధు ఇప్పిస్తామని చెప్పి దళితుల దగ్గర డబ్బులు వసూలు చేసిన కొందరు గులాబీ నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది. మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందనే నమ్మకంతో దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మి పథకాలు ఇప్పిస్తామని కలెక్షన్లు చేసిన కొందరు బీఆర్ఎస్ నాయకులకు ప్రభుత్వం మారడంతో మింగుడు పడటం లేదు. ఎన్నికల ముందు కొందరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పొదెం వీరయ్యను చూసుకొని దళితబంధు ఇప్పిస్తామని కలెక్షన్లు చేశారు.
తర్వాత రాజకీయ పరిస్థితులను బట్టి పొదెం ఓడిపోతారని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి ముందుచూపుతో బీఆర్‌ఎస్‌లో చేరారు. అలాంటి అవకాశవాద నాయకులు వసూలు చేసిన డబ్బులు కూడా ఎన్నికల సమయంలో పొదెం వీరయ్య తన గెలుపునకు అవినీతి మరక అంటకూడదనే భయంతో అప్పుచేసి మరీ రిటన్ ఇవ్వాల్సి వచ్చింది. ప్రజల తీర్పు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో తొందరపడి గోడదూకిన నాయకులు మళ్లీ వెనకచూపులు స్టార్ట్ చేశారు.
ఇదిలా ఉంటే కలెక్షన్ల గండం నుంచి బయటపడటం ఎలా అని బీఆర్ఎస్ లీడర్లు ఆలోచిస్తున్నారు. దళితబంధు లబ్దిదారుల ఎంపిక గత ప్రభుత్వం మాదిరిగా ఎమ్మెల్యేలకే ఉంటుందా లేక అధికారుల చేతిలోకి వెళుతుందా అనేది తెలియక ఏమవుతుందో అనే భయంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎమ్మెల్యేలకు ఇవ్వకుంటే తాము వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని, లేకుంటే రాజకీయంగా డామేజ్ అవుతామని ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ నుంచి వసూలు చేసిన వారిలో కూడా అలాంటి భయమే ఉన్నా అధికారం ఉంది కనుక ఈసారి గాకుంటే మళ్లీసారి ఇప్పిస్తామనే కప్పదాట్లకు అవకాశం ఉన్నందున ఊపిరి పీల్చుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి కలెక్షన్లు చేసిన వారిలో కొందరు లీడర్లు కాంగ్రెస్‌లో చేరి పొంచిఉన్న రాజకీయ గండం నుంచి బయటపడేందుకు మార్గాలు వెదుకుతున్నట్లు సమాచారం.
అధికార పార్టీ అయితే రక్షణ కవచంలా ఉంటుందని భావిస్తూ పార్లమెంట్ ఎన్నికలకు ముందే గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. మరోవైపు కాంట్రాక్టర్ల చూపు కాంగ్రెస్ వైపు అని ప్రచారం జరుగుతోంది. డైరెక్టుగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడమా లేక చేతిలో ఎమ్మెల్యే ఉన్నారు. కనుక బీఆర్ఎస్‌లోనే కొనసాగుతూ లోకల్ కాంగ్రెస్ లీడర్లతో సఖ్యతగా ఉండి తమ పనులు కానిచ్చుకోవాలనే ఎత్తుగడతో ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో ఆ ప్రభావంతో పార్లమెంట్ ఎన్నికలనాటికి కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.