Bihar CM నిర్ణయంతో KCR కు ఇబ్బందులు తప్పవా?

రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్‌గా దేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.

Update: 2023-01-07 07:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్‌గా దేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్ సీఎం నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనం అవుతోంది. నితీష్ కుమార్ ప్రభుత్వం శనివారం నుంచి బిహార్‌లో కుల ఆధారిత జనాభా గణనను ప్రారంభించింది. రూ.500 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. మొత్తం రెండు దశల్లో ఈ ప్రాజెక్టు కొనసాగనుంది. జనవరి 21 నాటికి మొదటి దశలో రాష్ట్రంలోని అన్ని కుటుంబాల సంఖ్యను లెక్కించనున్నారు. రెండవ దశ మార్చి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో అన్ని కులాలు, ఉపకులాలు మరియు మతాల ప్రజలకు సంబంధించిన డేటాను సేకరించబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం డిసెంబర్ 15న సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రజలందరి ఆర్థిక స్థితిగతుల సమాచారాన్ని పంచాయతీ నుంచి జిల్లా స్థాయి వరకు ఎనిమిది స్థాయిల్లో మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్‌గా డేటా సేకరిస్తారు. ఈ యాప్‌లో స్థలం, కులం, కుటుంబంలోని వ్యక్తుల సంఖ్య, వారి వృత్తి మరియు వార్షిక ఆదాయం గురించి ప్రశ్నలు ఉంటాయి. జనాభా లెక్కల కార్మికులలో ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ, ఎంజీఎన్ ఆర్ఈజీఏ లేదా జీవిక కార్మికుల చేత చేపట్టబోతున్నారు.

పొలిటికల్ ట్రిగ్గర్:

దేశంలో కుల ప్రాతిపదికన జనాభా గణన జరపాలనే డిమాండ్ అన్ని రాష్ట్రాల నుంచి వినిపిస్తోంది. దీన్ని చేపట్టడం ద్వారా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలతో పాటు ఇతర వర్గాల వారికి రిజర్వేషన్లలో మార్పులు చేపట్టే అవకాశం ఉంటుంది. కానీ భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ సంబంధించిన డేటాను మాత్రమే వెల్లడిస్తోంది. దీంతో తన జనాభా పెరిగిందని జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలంటే బీసీల లెక్కలు తేల్చాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కులాల వారీగా పథకాలు రూపొందించేందుకు ఈ కులగణన ఉపయోగపడుతుందని తద్వారా లబ్దిదారులకు మరింత మేలు జరిగుతుందని రాజకీయ పార్టీలు వాదిస్తున్నాయి. అయితే పార్టీల వాదనల వెనుక కులాల వారీగా జనాభా లెక్కలు ఉంటే ఓటర్లను సులువుగా తమ వైపు తిప్పుకునే ప్రణాళికలను అమలు చేయవచ్చనే స్ట్రాటజీ కూడా ఉంది. అందువల్ల ఇటీవల కులగణన కోసం రాజకీయ పార్టీల నుంచి డిమాండ్ పెరుగుతోందనే వాదన ఉంది. ఈ క్రమంలో సరిగ్గా 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తన్న వేళ నితీష్ కుమార్ ప్రభుత్వం క్యాస్ట్ బేస్‌గా గణాంకాలు తీయాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

కేసీఆర్‌కు సంకట స్థితి?

కేంద్రంలోని అధికార బీజేపీని ఢీ కొట్టడమే లక్ష్యంగా జాతీయ పార్టీని అనౌన్స్ చేసిన కేసీఆర్‌కు తన మిత్రుడు నితీష్ కుమార్ నిర్ణయం ఇబ్బందులు తీసుకువస్తుందా? అనే చర్చ తెరపైకి వస్తోంది. దేశంలో ఈసారి తీసే జనాభా లెక్కల్లో బీసీ కులాల వారీగా లెక్కలు తీయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అసెబ్లీలో తీర్మానం చేసింది. బీసీ కుల గణన చేపట్టాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ చాలా కాలంగా కోరుతున్నారు. త్వరలోనే ప్రధానిని మరోసారి కలిసి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతామని, కుల గణన, రిజర్వేషన్లపై జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కేంద్రంపై పోరాటం చేస్తామని గతంలో చెప్పారు. అయితే తెలంగాణ ప్రభుత్వం 2014 లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలోని బీసీ లెక్కలను మాత్రం కేసీఆర్ ప్రభుత్వం బయటకు చెప్పలేదు. ఈ పరిణామం బీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ముందు తెలంగాణ ప్రభుత్వం సేకరించిన కులాల వివరాలను బయట పెట్టిన తర్వాత కేంద్రాన్ని ప్రశ్నిస్తే బాగుంటుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో కులగణన విషయంలో నితీష్ కుమార్ నేషనల్ పాలిటిక్స్ లోకి పక్కాగా ప్లాన్ చేసుకుంటుంటే కేసీఆర్‌కు మాత్రం ఇదే అంశంలో విమర్శలు వ్యక్తం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.

Also Read..

Bandi Sanjay పై నాన్‌ బెయిలబుల్ కేసు నమోదు 

Tags:    

Similar News