మూడోసారి ఎంపీగా బీబీ పాటిల్‌కు బీఆర్ఎస్ టికేట్ దక్కేనా…?

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో విస్తరించి ఉన్న జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరని చర్చ మొదలైంది.

Update: 2024-01-09 13:42 GMT

దిశ, ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో విస్తరించి ఉన్న జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరని చర్చ మొదలైంది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గా పేరుగాంచిన బీబీ పాటిల్ ప్రస్తుతం బీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈ నెల 7 న తెలంగాణ భవన్ లో జహీరాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల పై సమీక్ష జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే క్యాండిడేట్లను మార్చి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని ఈసారి జరిగే ఎంపీ ఎలక్షన్‌లో ఆ తప్పిదం చేయమని చేసిన వ్యాఖ్యలు కారణమని చెప్పాలి. ఈ ప్రకారం ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో చాలామంది సిట్టింగ్‌లకు ప్రధానంగా అసమ్మతి, నాయకత్వలేమీ ఉన్న చోటా ఖచ్చితంగా క్యాండిడేట్లను మారుస్తారని చర్చ జరుగుతోంది. అదే సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బాన్సువాడ నుంచి ఎనిమిదో సారి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందలేదని సొంత పార్టీ నాయకులే ఓడించారని ఆయన వ్యాఖ్యానించడం కలకలం రేపింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త బీబీ పాటిల్‌ను జహిరాబాద్ స్థానం నుంచి బీఆర్ఎస్ రంగంలోకి దించి 2014, 2019 ఎంపీగా గెలిపించింది. గత ఎంపీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి కే మదన్ మోహన్ రావు రెండోసారి బరిలో నిలిచిన బీబీ పాటిల్‌కు గట్టి పోటీ ఇచ్చి గెలుపు కోసం ముచ్చెమటలు పట్టించారు. బీఆర్ఎస్ పార్టీ గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యల్ప మెజార్టీతో గెలిచిన స్థానాల్లో జహిరాబాద్ ఒక్కటి. ఎంపీ బీబీ పాటిల్‌కు స్థానిక లీడర్లతో సమన్వయం లేమి అని ప్రచారం జరుగుతంది. ఆయన పొలిటికల్ లీడర్ కన్న ఫక్తు బిజినేస్ మెన్ గానే పనిచేస్తున్నట్లుగా ఉంటుందని సొంత పార్టీ నాయకులు, క్యాడర్ కామెంట్ చేస్తారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపులో ఆయన కంట్రిబ్యూషన్ పెద్ధగా ఏమి లేదని అందరు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే అధికారిక కార్యక్రమాలు మినహా మిగిలిన పార్టీ కార్యక్రమాలు గాని లేకపోతే నియోజకవర్గాల్లో జరిగే ఎంపీకి సత్సంబంధాలు లేవని టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే నాలుగు నియోజకవర్గాల్లోని ఎవరో ఒక్కరు కొత్త వ్యక్తి ఎన్నికల సమయానికి తెరపైకి వస్తారని చర్చ జరుగుతుంది. సిట్టింగ్‌లకు గడ్డు కాలం వస్తే అక్కడ పోటి చేయడానికి కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ బిల్డర్ తిమ్మన్న గారి సుభాష్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన సీఎం కేసీఆర్ పోటీతో వెనక్కి తగ్గారు. అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో ఓటమి చెందిన మాజీ శాసన సభ్యులు కూడా పార్లమెంట్‌కు పోటీ చేసే యోచనలో ఉన్నారని టాక్ ఉంది.

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 4, మెదక్ ఉమ్మడి జిల్లాలో 3 అసెంబ్లి స్థానాలు కలవు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహిరాబాద్, బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలువగా, అందోల్, నారాయణ ఖేడ్, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది. కామారెడ్డి ఎకైక స్థానంలో బీజేపీ గెలిచింది. ఈ నేపథ్యంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని అధిక్యతతో ఓట్లను సాధించింది. అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలని ప్రణాళికలు వేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలు బూస్టింగ్ కాగా బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే జహీరాబాద్ పార్లమెంట్ స్థానంపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయడానికి పార్టీ క్యాండిడేట్ మార్పు అనివార్యం అని చర్చ జరుగుతుంది. ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో పార్టీ పరిస్థితులు, బల బలాలపై చర్చ జరిగిన టికెట్ల కేటాయింపు అంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అప్ప చెప్పిన నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగే అవకాశం ఉంది. ఐతే బీబీ పాటిల్ మాత్రం తనకు మూడోసారి ఎంపీగా కేసీఆర్ టికెట్ ఇస్తారని నమ్మకంతో చెబుతున్నారు. పార్లమెంట్ పరిధిలో ఎంపీగా పోటీ చేసే సత్తా, అర్హత తనకే ఉందని చెప్పుకుంటున్నారు. మరి కొందరు అనుచరులు మాత్రం బీబీ పాటిల్ పోటీ చేయడంటున్నారు.

బీఆర్ఎస్ పార్టీ సమీక్ష సమావేశం తర్వాత ఉమ్మడి జిల్లాలో జహీరాబాద్ నుంచి పోటీకి మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జహీరాబాద్ ఎంపీ సీటుపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతుంది. పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గంలో మంచి పట్టు ఉండగా, గడిచిన రెండు ధపాలుగా బాన్సువాడ ఎమ్మెల్యే టికెట్ తనయుడు భాస్కర్ రెడ్డి కి ఇప్పించాలని పోచారం విశ్వ ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ అధినేత ఆదేశాల మేరకు 8 వ సారి అసెంబ్లీ మెట్లు ఎక్కిన పోచారం జహీరాబాద్ నుంచి తనయుడిని రంగంలోకి దింపేందుకు ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో పార్టీ అధిష్టానానికి హింట్ ఇచ్చాడని చెబుతున్నారు.


Similar News