111 జీవో సవరించాలని సీఎంను కోరతా : చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన నుంచి రాగానే ఆయన్ను కలిసి 111 జీవో సవరణ చేయాలని విజ్ఞప్తి చేస్తానని చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Update: 2024-08-10 16:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన నుంచి రాగానే ఆయన్ను కలిసి 111 జీవో సవరణ చేయాలని విజ్ఞప్తి చేస్తానని చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ డెవలప్‌మెంట్ చేయాలనుకోవడం మంచిదేనని, కానీ వారి ప్రియారిటీ రాంగ్ అని చురకలంటించారు. మూసీ ప్రాజెక్టుపై సమగ్ర పరిశీలన అవసరమని, మూసీ ప్రక్షాళన ఒక ఆర్డర్‌లో చేపడితే దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందని విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టంచేశారు. దేశాన్ని అభివృద్ధి పంథాలో నడిపేలా కేంద్ర బడ్జెట్ ఉందని, రాజకీయాలను పక్కన పెట్టి రూ.35 వేల కోట్లను ఇప్పటి వరకు తెలంగాణకు కేంద్రం ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ రాజకీయ పార్టీలు ఈ వాస్తవాలు పక్కన పెట్టి మాట్లాడుతున్నాయంటూ విమర్శలు చేశారు. కేంద్ర బడ్జెట్లో యూపీ, గుజరాత్ పేర్ల ప్రస్తావన కూడా లేదన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్లు ఎంపీలు ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్ ఇవ్వాలంటే యూపీ ఎంపీలకు అధిక నిధులు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్.. ఒకవైపు బడ్జెట్ బాగాలేదని విమర్శలు చేస్తూనే తమ బడ్జెట్ ను కాపీ కొట్టారని అంటున్నారని, అంటే వారి ఐడియా బాగాలేదని ఒప్పుకుంటున్నట్లే కదా అంటూ ఎద్దేవా చేశారు. వక్ఫ్ బోర్డులో తీవ్రంగా అవినీతి జరుగుతోందని కొండా ఆరోపణలు చేశారు. వక్ఫ్ బోర్డు సవరణలు అమల్లోకి వస్తే దానిపై వచ్చే ఆదాయం పెరుగుతుందన్నారు. వచ్చే సెషన్ లో వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ అవుతుందని ఆశిస్తున్నట్లుగా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం వంటి లక్షల కోట్ల ప్రాజెక్టులకు బదులు ప్రజలకు లబ్ధి చేకూర్చే చిన్న చిన్న ప్రాజెక్టుల మరమ్మతు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కొండా డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ అధికార కార్యక్రమాలకు తనకు ఆహ్వానం అందుతోందని ఆయన స్పష్టంచేశారు.


Similar News